Sitaram Yechury: సీతారాం ఏచూరి భౌతికకాయంతో వైద్యులు ఏం చేస్తారు?

కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌ మెడికల్ కాలేజీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయం వైద్య పరిశోధనలకు, బోధనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update

మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ముందుగా అవయవాలు పనిచేయవు. ఆ తర్వాత కణజాలాలు కుళ్లిపోతాయి. శరీరం పాలిపోతుంది.. కండరాలు బిగిసుకుపోతాయి. శరీరంపై చిన్నచిన్న బొబ్బలు కనిపిస్తాయి. ఎవరికైనా జరిగేది ఇలానే ఉంటుంది. ఇక మనిషి మరణం తర్వాత మత సంప్రదాయాల ప్రకారం మృతదేహాన్ని కొందరు మట్టిలో కలిపేస్తారు.. మరికొందరు కాల్చిబూడిద చేస్తారు.. ఇదంతా నరకం, స్వర్గం లాంటి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. అందుకే కొంతమంది తాము చనిపోయినా సమాజానికి మేలు చేయాలనే ఆలోచనతో ఉంటారు. వారిలో కొందరు మరణించిన తర్వాత అవయవాల దానం చేస్తారు.. మరికొందరు తమ శరీరాన్ని మెడికల్‌ కాలేజీలకు డొనేట్ చేస్తారు. ఇలా అభ్యున్నత భావాలు కలిగినవారిలో సీతారాం ఏచూరి కూడా ఒకరు! 

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూయడం దేశాన్ని విషాదాన్ని ముంచేసింది. 72 ఏళ్ల సీతారాం ఏచూరి కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఆగస్టు 19న న్యుమోనియాతో ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. అయితే డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఏచూరిని సాధారణ స్థితికి తీసుకురాలేకపోయారు. పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 12 మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను కడవరకు పాటించారు ఏచూరి. ఆయన మరణం తర్వాత తన భౌతికకాయాన్ని మెడికల్‌ కాలేజీకు అప్పగిస్తానని గతంలో అనేకసార్లు చెప్పారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌ మెడికల్ కాలేజీకి అప్పగించారు. గతంలో ఇలా చేసిన వారిలో న్యాయనిపుణుడు లీలా సేథ్, సీపీఐ (M) నాయకుడు సోమనాథ్ ఛటర్జీ, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ ముఖ్‌ లాంటివారు ఉన్నారు.

ఇలా మరణం తర్వాత కాలేజీలకు దానం చేసే శరీరాన్ని విద్యార్థుల బోధనకు ఉపయోగిస్తారు. వైద్య పరిశోధనకు ఇది కీలకం. మానవ శరీరాన్ని అర్థం చేసుకోవడానికి వైద్య విద్యార్థులకు ఈ శరీరాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు, రోబోటిక్ లేదా ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స, గుండె కవాట మార్పిడి, మొటిమలకు లేజర్ చికిత్స లాంటి వాటిని సర్జన్లకు నేర్పడం కోసం ఈ శరీరాలను వినియోగిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణాలను రక్షించే శస్త్రచికిత్సా విధానాలు చాలా వరకు ఇలా చనిపోయిన శరీరాలపైనే జరిగాయి. అంటే మరణం తర్వాత కూడా మన శరీరాలు ఇతరుల ప్రాణాలను నిలబెట్టేందుకు, వైద్య శాస్త్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతాయి.

96 ఏళ్ల గుండె ఇప్పటికీ మన ప్రపంచంలో 26 సంవత్సరాల గుండె లాగా విలువైనదే. ఎందుకంటే 96ఏళ్లకు మనిషి చనిపోతే.. సంబంధిత వ్యక్తి ఆస్పత్రికి తన డెడ్‌బాడీని దానం చేస్తే ఆ గుండెతో పాటు ఇతర అవయవాలపై పరిశోధన చేయవచ్చు. ఇలా ఎన్నో పరిశోధనలు జరిగాయి కాబట్టే వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి సాధించింది. అనేక రకాల వ్యాధులకు చికిత్సలను కనుగొంది. మీరు కూడా మీ మరణం తర్వాత శరీరాన్ని దానం చేయాలనుకుంటే సమీపంలోని వైద్య కళాశాలలు లేదా బాడీ డొనేషన్ NGOలను సంప్రదించాలి. ఈ విషయాన్ని మీ కుటుంబసభ్యులకు చెప్పాలి. అప్పుడే మీ మరణం తర్వాత మీ ఆశయం నేరవేరుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు