online protest: ఇండియాలో 1.2 కోట్ల మంది ఆన్‌లైన్ సమ్మె.. స్విగ్గీ, జోమోటో, జెప్టో సర్వీసులు బంద్!

గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పిలుపుతో నేడు దేశవ్యాప్త ఆన్‌లైన్ సమ్మె నిర్వహించారు. ఫిబ్రవరి 3న కూడా మరో సారి సమ్మెకు దిగనున్నారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్‌లలో లక్షలాది మంది డెలివరీ భాగస్వాములు నిరసనలో పాల్గొన్నారు.

New Update
Gig Workers

గతంలో ఏదైనా వస్తువు కావాలంటే అది ఉంటే చోటుకే మనం వెళ్లాలి. ఇప్పడలా కాదు.. వేళ్లపై ఆర్డర్ చేస్తే క్షణాల్లో అది మన కాళ్ల కాడికి వస్తోంది. ఈ ప్రాసెస్ ఒకరికి ఉపాదినిస్తే.. మరోకరికి అవసరాన్ని తీర్చుతుంది. డిజిటల్ లైఫ్ స్టైల్ పెరిగిపోవడం వల్ల ఆల్‌లైన్ ఆర్డర్లు, బుకింగ్స్ బాగా ప్రజాధరణ పొందాయి. ఆన్‌లైన్‌లో రోజూ లక్షలాది మంది అవసరాలను తీర్చే వారు.. ఆన్‌లైన్‌లోనే సమ్మె చేయాలనుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు జనవరి 26(నేడు) దేశవ్యాప్త ఆన్‌లైన్ సమ్మె నిర్వహించారు. ఫిబ్రవరి 3న కూడా మరో సారి సమ్మెకు దిగనున్నారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి ప్రముఖ యాప్‌లలో పనిచేసే లక్షలాది మంది డెలివరీ భాగస్వాములు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సమ్మెలో భాగంగా కార్మికులు తమ యాప్‌ల నుండి 'లాగౌట్' అయ్యి సేవలను నిలిపివేశారు. గిగ్ వర్కర్లు అంటే సులభంగా చెప్పాలంటే, ఒక సంస్థలో పర్మినెంట్ ఎంప్లాయ్ కాకుండా కేవలం ఓ లిమిటెడ్ టైంకి లేదా ఓ పర్టికులర్ పనిచేసేవారు. వీరిని ఇండిపెండెట్ వర్కర్లు అని కూడా పిలవవచ్చు. 

ఇండియాలో ఎంతమంది అంటే?

నీతి ఆయోగ్, వివిధ ఆర్థిక నివేదికల ప్రకారం.. భారతదేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో సుమారు 1.2 కోట్ల (12 మిలియన్లు) మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. 2020-21లో ఈ సంఖ్య కేవలం 77 లక్షలుగా ఉండేది. అంటే గత నాలుగేళ్లలోనే ఈ రంగం భారీగా విస్తరించింది. 2030 నాటికి ఈ గిగ్ వర్కర్ల సంఖ్య 2.35 కోట్లకు (23.5 మిలియన్లు) చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఇండియా డెవలప్‌ కంట్రీగా మారే నాటికి (2047) ఈ సంఖ్య 6.2 కోట్లకు చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వీరిలో అత్యధికులు రిటైల్, రవాణా, ఫుడ్ డెలివరీ రంగాల్లో పనిచేస్తున్నారు. గిగ్ వర్కర్లలో సుమారు 47% మంది మధ్యస్థ నైపుణ్యం , 22% మంది అధిక నైపుణ్యం, 31% మంది తక్కువ నైపుణ్యం కలిగిన పనుల్లో ఉన్నారు. మొత్తం గిగ్ వర్క్‌ఫోర్స్‌లో మహిళలు సుమారు 28% వరకు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.

వారి ప్రధాన డిమాండ్లు ఇవే:

కనీస వేతనం, ఇన్సెంటివ్‌లు: పెరుగుతున్న పెట్రోల్ ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా ఆర్డర్ రేట్లను పెంచాలని, స్పష్టమైన వేతన విధానాన్ని అమలు చేయాలని వారు కోరుతున్నారు.
10 నిమిషాల డెలివరీ రద్దు: క్విక్ కామర్స్ సంస్థలు ప్రవేశపెట్టిన '10 నిమిషాల డెలివరీ' మోడల్ డెలివరీ బాయ్స్ ప్రాణాలను ముప్పులోకి నెడుతోందని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సామాజిక భద్రత: గిగ్ వర్కర్లకు ఈఎస్ఐ, పీఎఫ్, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
ఏకపక్ష ఐడీ బ్లాకింగ్: ఎటువంటి ముందస్తు సమాచారం లేదా విచారణ లేకుండా కంపెనీలు వర్కర్ల ఐడీలను బ్లాక్ చేయడాన్ని నిరసిస్తున్నారు.
చట్టపరమైన గుర్తింపు: గిగ్ కార్మికులను కూడా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకువచ్చి, వారికి చట్టపరమైన రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు