Nicolas Maduro: ఇండియాలో లింక్స్.. సత్యసాయికి పరమ భక్తుడిగా వైరల్

అమెరికా దాడితో పదవి కోల్పోయి, బందీగా పట్టుబడ్డ నికోలస్ మదురోనుకి ఇండియాలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తితో నికోలస్‌కు ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

New Update
_Venezuelan President

అమెరికా దాడితో పదవి కోల్పోయి, బందీగా పట్టుబడ్డ నికోలస్ మదురోనుకి ఇండియాలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తితో నికోలస్‌కు ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాథలిక్ మతస్థుడైన మదురో, తన భార్య సిలియా ఫ్లోరెస్ వల్ల పుట్టపర్తి సత్యసాయి బాబా వైపు ఆకర్షితులయ్యారు. వీరిద్దరూ పరమ భక్తులు. 2005లో ఈ దంపతులు అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వచ్చి సాయిబాబాను స్వయంగా కలుసుకున్నారు. బాబా పాదాల వద్ద ఈ దంపతులు కూర్చుని ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ టూర్ మదురో జీవితంపై బలమైన ముద్ర వేసింది.

మదురో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన భక్తిని చాటుకున్నారు. తన ప్రైవేట్ భవనంలో వెనెజువెలా గొప్ప నాయకులైన సిమోన్ బొలివర్, హ్యూగో చావెజ్ చిత్రపటాలతో పాటు సత్యసాయి బాబా ఫోటోను కూడా ఉంచారు. 2011లో సత్యసాయి బాబా మరణించినప్పుడు, అప్పటి విదేశాంగ మంత్రిగా ఉన్న మదురో జాతీయ అసెంబ్లీలో అధికారిక సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బాబా చేసిన ఆధ్యాత్మిక సేవలను గుర్తిస్తూ వెనెజువెలాలో జాతీయ సంతాప దినాన్ని కూడా ప్రకటించడం విశేషం.

మదురో పాలనలో అనేక విదేశీ సంస్థలు బహిష్కరణకు గురైనప్పటికీ, సత్యసాయి సంస్థ మాత్రం నిరాటంకంగా తన కార్యకలాపాలను కొనసాగించింది. లాటిన్ అమెరికాలోనే అతిపెద్ద సాయి భక్త బృందాలు వెనెజువెలాలో ఉండటం గమనార్హం.

బస్ డ్రైవర్ నుంచి అధ్యక్షుడి వరకు..

1962లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన మదురో రాజకీయ ప్రస్థానం గొప్పది. ఆయన తండ్రి ట్రేడ్ యూనియన్ నాయకుడు కాగా, మదురో తొలినాళ్లలో బస్ డ్రైవర్‌గా పనిచేశారు. 1992లో హ్యూగో చావెజ్ నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు సమయంలో ఆయనకు మద్దతుగా నిలిచారు. చావెజ్ జైలు నుంచి విడుదల కావాలని పోరాటం చేసి, కాలక్రమేణా ఆయన వారసుడిగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. గతేడాది నవంబర్‌లో బాబా శతజయంతి సందర్భంగా మదురో భావోద్వేగపూరిత సందేశాన్ని ఇచ్చారు. బాబాను 'కాంతి స్వరూపుడు' అని అభివర్ణిస్తూ, ఆయన జ్ఞానం మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉండాలని కోరుకున్నారు.

రాజకీయంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, మదురో తన వ్యక్తిగత జీవితంలో భారతీయ ఆధ్యాత్మికతకు పెద్దపీట వేశారు. ప్రస్తుతం అమెరికాలో బందీగా ఉన్న మదురో భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Advertisment
తాజా కథనాలు