/rtv/media/media_files/2025/11/11/delhi-blast-incident-2025-11-11-12-42-43.jpg)
Delhi Blast Incident
Delhi Blast Incident: డిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజా సమాచారం ప్రకారం, ఈ దాడి వెనుక ఉన్న అనుమానిత ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ మహమ్మద్ తల్లి, ఇద్దరు సోదరులను జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు ఉమర్ కుటుంబ సభ్యుల నుంచి DNA నమూనాలు సేకరిస్తున్నారు, దాడిలో మరణించిన వ్యక్తి ఉమర్‌నేనా అని నిర్ధారించేందుకు ఈ చర్యలు చేపట్టారు.
ఉమర్‌పై అనుమానాలు ఎలా వచ్చాయి?
సమాచారం ప్రకారం, గత వారం ఉమర్ తన తల్లికి “తనను ఎవరు సంప్రదించకూడదు, లైబ్రరీలో చదువుకుంటున్నాను” అని చెప్పి ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశాడు. తర్వాత నుంచి అతని కదలికలపై ఎటువంటి సమాచారం అందలేదు. ఉమర్, ఇప్పటికే అరెస్ట్ అయిన ఇద్దరు వైద్యులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌లకు పరిచయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరిని జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీస్ బృందాలు సోమవారం నాడు ఉగ్రవాద మాడ్యూల్ కేసులో పట్టుకున్నాయి. డాక్టర్ రాథర్ సమాచారం ఆధారంగా ఫరీదాబాద్‌లో జరిగిన రైడ్‌లో 3,000 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం చేసుకున్న పోలీసులు, వెంటనే ఉమర్‌పై దృష్టి సారించారు. సహచరులు అరెస్టు అయిన విషయం తెలుసుకున్న ఉమర్ భయంతో పారిపోయి, కొత్త దాడి ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది.
పేలుడు ఎలా జరిగింది? Delhi Bomb Blast
ఉమర్, తన సహచరులతో కలిసి కారులో అమోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్, డెటోనేటర్లు ఉపయోగించి పేలుడు పరికరం అమర్చినట్లు అనుమానం. ప్రాథమిక దర్యాప్తులో ఇది ఒక ఆత్మాహుతి దాడి అని డిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో హోం సెక్రటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, డిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. డిల్లీ పోలీసులు UAPA, ఎక్స్‌ప్లోసివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజధానిలోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా అలర్ట్
డిల్లీ పేలుడు తరువాత దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద కఠిన తనిఖీలు జరుగుతున్నాయి. అన్ని వాహనాలను చెక్ చేస్తున్నారు. లాల్‌కిళా మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు, అలాగే నేతాజీ సుభాష్ మార్గ్ పరిసర ప్రాంతాల్లో వాహన రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరుతున్నారు.
Follow Us