Breaking: తిరుమల ప్రసాదంపై సీబీఐ విచారణకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం తిరుమల తిరుపతి లడ్డూలో జంతు కళేబరం నూనెను కలిపి తయారు చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు చేశారు.
బుధవారం ఎన్డీఏ కూటమి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన ఆయిల్ ఉపయోగించారని తెలిపారు. ఈ విషయం తెలియగానే తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు. అయితే ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యిని ప్రసాదాలకు వాడుతున్నామని, ప్రజలకు స్వచ్ఛమైన భోజనం, ప్రసాదం అందించడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు.
తిరుపతి ప్రసాదం, భోజనంలో నాసిరకమైన సరుకులు వాడారు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నాం' అని చంద్రబాబు చెప్పారు.
దీంతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ విషయం దేశ రాజకీయాల్లోకి వెళ్లడంతో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ విషయం గురించి వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో టీటీడీ మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు టీడీపీ అధికార ప్రతినిధి వెంకటరామనారాయణ రెడ్డి వెల్లడించారు.
ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు (ఫారిన్ ఫ్యాట్స్) కలగలిసి ఉన్నట్లు ఆ పరీక్షల్లో వెల్లడైందని వివరించింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.