దేశ రాజధానిని ఇప్పటికే వరదలు ముంచెత్తాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు యమునా ఉప్పొంగి ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అటు మహారాష్ట్ర , గుజరాత్‌లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . రెండు రాష్ట్రాలపాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సాయంత్రం వరకు మేఘావృతమై ఉండే అవకాశం ఉందని, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం తర్వాత తేమ మరింత పెరిగే అవకాశం ఉంది.
మహారాష్ట్రలోని 10 జిల్లాలతో పాటు గుజరాత్‌లో నేటి నుంచి మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ తీరంలో వర్షపాత కార్యకలాపాల పెరుగుదలతో భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముంబయి, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి, సతారా, భండారా, చంద్రాపూర్, గడ్చిరోలి, పూణే, పాల్ఘర్‌లపై మరింత ప్రభావం చూపనుంది.
కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ, ఒడిశాలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, రాబోయే మూడు రోజుల పాటు యుపిలోని అనేక ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు కూడా పశ్చిమ యూపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, బీహార్‌లో జూలై 23 వరకు, రుతుపవనాలు మునుపటిలా బలహీనంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.