దేశంలోని ప్రమాదకరమైన కొండచరియ ప్రదేశాలలో ఉత్తరాఖండ్ ఒకటి. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో కీలకమైన హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్ టూరిస్టులు చిక్కుకుపోయారు. భారీ వర్షం వల్ల ఆ ప్రాంతంలో కొండచరియలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటన చమోలీ జిల్లాలోని చిన్కా వద్ద చోటు చేసుకుంది. మరోవైపు ఉత్తరాఖండ్‌కు ఆరెంట్ అలర్ట్ జారీ చేశారు అక్కడి వాతావరణ అధికారులు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఉత్తరాఖండ్ ఐఎండీ ప్రజలనుద్దేశించి హెచ్చరికలు జారీ చేసింది.
ఇవాళ ఉదయం ఎడతెరిపి లేకుండా ఢిల్లీలో కూడా కుండపోత వర్షం కురిసింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే వర్షపు నీరుతో పూర్తిగా నిండిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. అయితే ఇదిలా ఉంటే... కొన్ని రోజుల క్రితం... హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా టూరిస్టులు చిక్కుకున్న విషయం తెలిసిందే.
మనాలీలో దాదాపు 300 మంది టూరిస్టులు మూడు రోజుల పాటు ఎటూ కదలలేని పరిస్ధితి నెలకొంది. దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. మండీ.. కుల్లు రూట్లో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. హిమాచల్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే 19 మంది వరకు టూరిస్ట్‌లు, స్ధానికులు మరణించారని అక్కడి అధికారులు వెల్లడించారు.