ముచ్చటపడి తీసుకున్న సెల్ఫీ ఫొటో ఓ పోలీసు అధికారిని పీకల్లోతు చిక్కుల్లోకి నెట్టింది. అక్షరాల 14 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో దిగిన సెల్ఫీ నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా సంపాదించాడు అనే కోణంలో అతనిపై దర్యాప్తు సాగుతోంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక అసలు వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్‌లో రమేష్ చంద్ర సహాని ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
అతనితో సహా తన భార్య, అతని పిల్లలు వారి ఇంట్లో ఉన్న రూ.500 నోట్ల కరెన్సీ కట్టలతో సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిని ఫొటోలో 14 లక్షల రూపాయల విలువైన 27 నోట్ల కట్టలు (రూ.500) తమ బెడ్‌రూంలో బెడ్‌పై పరిచి.. ఆ నోట్ల కట్టల పక్కన భార్య, ఇద్దరు పిల్లలు కూర్చోని సుహానీ ఫొటోకు స్టిల్ ఇచ్చారు. ఈ సెల్ఫీ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు సహానిపై విచారణకు ఆదేశించారు.
2021, నవంబర్ 14న తమ కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు వచ్చిన డబ్బుతో ఆ ఫోటో తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. రమేష్ చంద్ర సహానికి భార్య, పిల్లలతో దిగిన సెల్ఫీలో చూపించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సహానీ పై అధికారులు అతన్ని వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. ప్రస్తుతం అతనిపై దర్యాప్తు కొనసాగుతోంది.