Sir CV Raman Effect: ఫిబ్రవరి 28.. ఇది దేశానికి చాలా ప్రత్యేకమైనద రోజు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ గౌరవార్థంగా ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. 1928లో ఫిబ్రవరి 28న సీవీ రామన్ 'రామన్ ఎఫెక్ట్'ను కనుగొన్నట్లు ప్రకటించారు. ఈ ఆవిష్కరణకు 1930లో ఆయన నోబెల్ బహుమతి పొందారు. ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని 1986లో అప్పటి ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించింది.
లక్ష్యమేంటి?
ఈ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రాథమిక లక్ష్యం దేశంలోని విద్యార్థులను సైన్స్ రంగంలో కొత్త ప్రయోగాలకు ప్రేరేపించడం. అంతేకాదు వారిని సైన్స్ వైపు ఆకర్షించడం, వైజ్ఞానిక విజయాలపై వారికి అవగాహన కల్పించడం.
సెల్యూట్ సర్:
సీవీ రామన్ పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్. ఆయన నవంబర్ 7, 1888న తమిళనాడులో జన్మించారు. 1907లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఎంఎస్సీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. 1933 వరకు కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్‌లో పనిచేశారు. భౌతిక శాస్త్రానికి సంబంధించిన వివిధ అంశాలపై పరిశోధన చేశారు.
రామన్ ఎఫెక్ట్ అంటే?
రామన్ ఎఫెక్ట్ కాంతి వెదజల్లే ప్రక్రియ. ఘన, ద్రవ లేదా వాయువు లాంటి ఏదైనా మాధ్యమం ద్వారా కాంతి ప్రవేశించినప్పుడు దాని స్వభావం మారుతుంది. నేటికీ రసాయనాల పరమాణు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి రామన్ ఎఫెక్ట్ ఒక ముఖ్యమైన సాధనం. 1921లో తన యూరప్ పర్యటనలో సీవీ రామన్ ఈ ఆవిష్కరణకు ప్రేరణ పొందారు. ఆయన సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు మధ్యధరా సముద్రం నీలం రంగు గురించి రామన్ మనస్సులో ఒక ప్రశ్న తలెత్తింది. ఆ తర్వాత ఈ అంశంపై పరిశోధన చేశారు. సుమారు ఏడేళ్లపాటు శ్రమించి 1928లో తన పరిశోధనను పూర్తి చేసి ప్రపంచానికి అందించారు. ఆయన ఆవిష్కరణకు 1930లో సైన్స్‌లో రామన్‌కు నోబెల్ బహుమతి లభించింది. దేశం నుంచి మాత్రమే కాకుండా ఆసియా నుంచి సైన్స్ రంగంలో ఈ గౌరవం పొందిన మొదటి శాస్త్రవేత్త సీవీ రామన్.
Also Read: డేంజర్‌లో కాంగ్రెస్ సర్కార్.. కూల్చేందుకు బీజేపీ కుట్రలు!