బాటసింగారం వెళ్లేందుకు అనుమతి లేదని బీజేపీ నేతలకు పోలీసులు తెలపడంతో.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు. తాము హత్యలు చేయడానికి వెళ్లడంలేదని, పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పరిశీలించడానికి వెళ్తున్నామన్నారు.ఐనా పోలీసులు ససేమీరా అనడంతో కిషన్ రెడ్డి, రఘునందన్ రావులతో పాటు బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. నగరంలో వర్షం పడుతున్నా..
వారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డుపై కూర్చొని సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో ప్రతిపక్ష నేతలు ఇతర ప్రాంతాలకు తిరిగే స్వేచ్చ లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ నియంత పాలనలో ప్రజాస్వామ్యానికి భంగం వాటిళ్లుతోందన్నారు. తెలంగాణలో కేవలం కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రమే కొనసాగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత 9 ఏళ్లలో కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ లేకుండా చేస్తున్నాడని కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బాటసింగారం వెళ్తున్న విషయంపై హైదరాబాద్ పరిధిలో ఉండే బీజేపీ నేతలకు మాత్రమే సమాచారం ఇచ్చానని, కానీ ఆదిలాబాద్‌లో ఉన్న బీజేపీ నేతలు సైతం బాటసింగారం వచ్చేందుకు రెడీ అయ్యారన్నారు. బీజేపీ నేతలతో పాటు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న చాలామంది రైతులు సైతం స్వచ్చందంగా తమ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారని వెళ్లడించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీ రాష్ట్ర స్థాయి, జిల్లా నేతలను, మండల పార్టీ నేతలను సైతం అరెస్ట్ చేశారు.