టీమిండియా యంగ్ సంచలనం యశస్వి జైస్వాల్ తన తొలి టెస్టుని మెమరబుల్ గా మార్చుకున్నాడు. ఐపీఎల్లో రాణించడం, ఆ తర్వాత విండీస్ టూర్ లో భాగంగా టెస్టు స్క్వాడ్ లో జట్టులో స్థానం దక్కడం, తుది జట్టులో ఆడే అవకాశం రావడం, తొలి టెస్టులోనే భారీ శతకంతో మెరవడం ఇదంతా చకచకా.. కేవలం రెండు నెలల్లోనే పూర్తి అయిపోయింది. ప్రస్తుతం కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్న జైస్వాల్.. భవిష్యత్తు స్టార్ గా కితాబులందుకుంటున్నాడు. ఒక్క ఇన్నింగ్స్ తో తనను తాను నిరూపించుకొని టీమిండియా ఆశాకిరణంలా మారాడు. ఎంతో నైపుణ్యం ఉన్న బ్యాటర్ లాగా, పరిణితి చెందిన ఆటతో ఆకట్టుకున్నాడు. ఇదంతా చూసిన జైస్వాల్ తండ్రి.. కొడుకు తొలి మ్యాచులోనే సెంచరీ చేయడంతో కావండ్ యాత్రకు బయలుదేరాడు.
171 పరుగులు చేసి సత్తా చాటిన జైస్వాల్
విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో జైస్వాల్ 171 పరుగులు చేసి సత్తా చాటాడు. జైస్వాల్ జట్టులో అందరికంటే జూనియర్ అయినా.. టీమిండియా టాప్ స్కోరర్ కావడం విశేషం. అంతేకాదు తనాడిన తొలి మ్యాచులోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచి తన ఎంట్రీని గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. ఇక ఈ సెంచరీని జైస్వాల్ తన తల్లిదండ్రులకి అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ... తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే జైస్వాల్ తండ్రి మాత్రం కొడుకుని మించి సంబరాలు చేసుకుంటున్నాడు. భుజాన గంగాజలాన్ని మోసుకొని తమ నివాసం నుంచి ఏకంగా ఝార్ఖండ్‌లోని దేవ్ఘడ్కి కాలినడకన బయలుదేరాడు.
జైస్వాల్ తండ్రి దేవ్ఘడ్కి కాలినడకన యాత్ర
యశస్వికి టెస్టు క్యాప్ దక్కడం, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిస్ ఓపెనింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అతను మరిన్ని సంతకాలు సాధించాలి. అతను సాధించిన శతకం మా కుటుంబంతో పాటు మా జిల్లా అంతా గర్వపడుతుంది. అతడు క్రికెట్ లో మరింత ముందుకెళ్లాలని ఈ యాత్రను చేపట్టాను. నా కుమారుడిని ఇలాగే ఆశీర్వదించాలని ఆ వైద్యనాధుడికి జలాభిషేకం చేసి వేడుకుంటానని జైస్వాల్ తండ్రి తెలిపాడు. ఇక ఈ మ్యాచులో జైస్వాల్ సెంచరీతో పాటు అశ్విన్ బౌలింగ్‌లో రాణించడంతో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 20 న జరుగనుంది.