లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో రెజ్లర్లు ఉధృత స్థాయిలో ఢిల్లీ వేదికగా తమ నిరసనలు తెలియజేయడంతో మొత్తానికి బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేసి వెయ్యి పేజీల ఛార్జి షీటును నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు సుమారు 100 మంది వాంగ్మూలాలను సేకరించినట్లు తెలిపారు అయితే వారిలో 15 మంది ఇచ్చిన వాంగ్మూలాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపారు.
బ్రిజ్‌భూషణ్ నేరాలకు పాల్పడితే జైలుకే ఢిల్లీ పోలీసుల ఆరోపణ
అయితే బాధితులను నేరపూరితంగా బెదిరించడం, మహిళల గౌరవమర్యాదలను భంగపరచడం, లైంగిక వేధింపులు, వెంటాడటం వంటి నేరాలకు బ్రిజ్‌భూషణ్ పాల్పడినట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు ఈ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఓ బాధితురాలిపై సింగ్ వేధింపులు పదే పదే కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు కేసుల్లో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 354డీ సెక్షన్ల కింద పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు రుజువైతే ఆయనకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
మీడియాతో మాట్లాడటానికి నిరాకరించిన భూషణ్
ఈ సాక్ష్యాలను ఢిల్లీ కోర్టులో సమర్పించనున్నట్లు తెలిపిన ఢిల్లీ పోలీసులు నేరం రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయని తెలిపారు. అసలే నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ కాస్తంత క్రమశిక్షణతో వ్యవహరించాల్సింది పోయి ఇటీవల ఒక విలేఖరిపైన అనుచితంగా వ్యవహరించడంతో మరింతగా తన క్రమశిక్షణ పట్ల ఓ నిందను మూటగట్టుకున్నారు. జూలై 18 కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు కూడా అందుకున్న బ్రిజ్ భూషణ్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. నేరుగా కోర్టులోనే మాట్లాడతానని భూషణ్ పేర్కొన్నారు.