మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన భయంకరమైన వీడియోపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటన వెనుక ఎవరూ ఉన్నా క్షమించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, అక్షయ్ కుమార్, వివేక్ అగ్నిహోత్రి, కియారా అద్వానీ, రితేష్ దేశ్ ముఖ్, రిచా చద్దా వంటి బాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. మణిపూర్ దారుణ వీడియో ఘటనలో ఎట్టకేలకు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మణిపూర్ ఘటన యావత్ భారతదేశాన్ని ఆగ్రహానికి గురి చేస్తోంది. మహిళల్ని అత్యంత క్రూరంగా హింసించి నగ్నంగా ఊరేగించి వారిపై అత్యాచారం చేసిన వీడియోపై ప్రముఖులు స్పందిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశానికి ముందు ప్రధాని మోదీ ఈ ఘటనపై మాట్లాడారు. ఇది ఏ సమాజానికైనా అవమానకరమైన ఘటన అని.. మన దేశాన్ని సిగ్గుపడేలా చేసిందన్నారు. శాంతి భద్రతలను మరింత కఠినతరం చేయాల్సిందిగా సీఎంలకు సూచించారు.
మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్
ఈ ఘటనపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నాన్ని విడిచి పెట్టబోమని హామీ ఇచ్చారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల వీడియో చూసి అవాక్కయ్యానన్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులకు కఠిన శిక్ష పడాలని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేశారు.
బాలీవుడ్ నటి కియారా అద్వానీ
బాలీవుడ్ నటి కియారా అద్వానీ సైతం ఈ ఘటనపై స్పందించారు. ‘మణిపూర్‌లో మహిళలపై హింసకు సంబంధించిన వీడియో భయానకంగా ఉంది.. నన్ను కదిలించింది.. వారికి త్వరగా న్యాయం జరగాలని ప్రార్ధిస్తున్నాను.. బాధ్యులకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ‘స్త్రీ గౌరవంపై దాడి చేయడం మానవత్వంపైనే దాడి చేయడమే’ అంటూ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ట్వీట్ చేశారు.
నటి రిచా చద్దా
నటి రిచా చద్దా డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సూర్యప్రతాప్ సింగ్ వంటి వారు ఈ ఘటనకు పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటపై చర్చించాలని డిమాండ్ చేస్తూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు లోక్ సభ, రాజ్యసభల్లో నోటీసులు ఇచ్చారు.
అందరి ఆత్మలను కదిలించిందంటూ సోనూసూద్ ట్వీట్
"వలసదారుల మెస్సీయా" అని పిలువబడే సోనూ సూద్ కూడా మణిపూర్ సామూహిక అత్యాచారంపై తన అభిప్రాయాలను మరియు ఆందోళనను వ్యక్తం చేశాడు. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో, “మణిపూర్ వీడియో ప్రతి ఒక్కరి ఆత్మను కదిలించింది. ఊరేగించింది మానవత్వమే.. మహిళలను కాదు. మణిపూర్ హింసాకాండపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ హాస్యనటుడు వీర్ దాస్ ఈ ట్వీట్ల పరంపరలో పరిపాలన, పలువురు రాజకీయ నేతలు, అధికారులు స్పందిస్తున్నారు.