చిరుత ఒక ఇంట్లోకి చొరబడింది. పెంపుడు కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుక్క గట్టిగా మొరిగి చిరుతను భయపెట్టింది. దీంతో ఆ చిరుత వెనుతిరిగి అక్కడి నుంచి పారిపోయింది. ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాహురి తాలూకాలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక ఇంటి కాంపౌడ్‌లోకి అర్ధ రాత్రి వేళ చిరుత ప్రవేశించింది. ఆ ఇంటికి కాపలా ఉన్న కుక్క వద్దకు అది మెల్లగా వచ్చింది. దాడి చేసి తినేందుకు ఆ కుక్కను సమీపించింది.
కాగా, చిరుతను చూసిన ఆ కుక్క ఏ మాత్రం అదరలేదు, బెదరలేదు. పైగా చిరుతను చూసిన కుక్క గట్టిగా మొరిగింది. ఎదురు దాడికి సైతం దిగింది. ఆ కుక్కను తట్టుకోలేక చిరుత వెనక్కి తగ్గింది. మెల్లగా అక్కడి నుంచి గోడ దూకి పారిపోయింది. ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీలో ఇదంతా రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
మరోవైపు, ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని రామ్‌నగర్ ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక చిరుత ప్రహరీ గొడ నుంచి దూకి ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న పెంపుడు కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే చిరుత దాడిని ఆ కుక్క ఎదుర్కొంది. పెంపుడు కుక్క తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆ చిరుత అక్కడి నుంచి పారిపోయింది.