బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికలు కాస్త ప్రజల ప్రాణాల మీదకొచ్చింది. అక్కడక్కడ ఆయా పార్టీ నేతల మద్య వాగ్వాదం కాస్త ఘర్షణలకు దారి తీశాయి. ఈ ఘర్షణలో గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉండటం గమనార్హం. భద్రత కల్పించడంలో కేంద్ర బలగాలు పూర్తిగా వైఫల్యం చెందాయని తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రస్ధాయిలో కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్‌ల వద్ధ భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.
తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణలు
ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణలు చెలరేగాయి. పలు ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారు. కొన్నిచోట్ల బ్యాలెట్ బాక్సులను తగులబెట్టారు. వివిధ పార్టీల కార్యకర్తలు పోలింగ్ బూత్‌లలోకి వెళ్లి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో 11 మందికి పైగా మరణించడంతో రాష్ట్రంలో హింసకాండకు దారి తీసిందనే చెప్పాలి.
గాయపడిన వారిని పరామర్శించిన గవర్నర్
బెంగాల్ లోని గ్రామీణ ప్రాంతాల్లోని 73,887 స్థానాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. 22 జిల్లా పరిషత్‌లు, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాల్లోని దాదాపు 928 స్థానాలకు 2.06 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 5.67 కోట్ల ఓటర్లు ఉన్నారు. దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70 వేల మంది రాష్ట్ర పోలీసులు విధులను నిర్వహిస్తున్నారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి, హింసలో గాయపడిన ప్రజలను పరామర్శించారు. అనంతరం పోలింగ్ బూత్‌ల వద్దున్న ఓటర్లతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించి ఈ దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.