ఈ రోజు రాజమండ్రిలో జరిగిన టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల 45 నిమిషాలు పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు పార్టీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై సుధీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్ కల్యా (Pawan Kalyan) మాట్లాడుతూ.. వైసీపీ (YCP) వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోనని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అన్ని పార్టీల నేతలనూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధే తమకు ముఖ్యం అన్నారు. అనుభవం ఉన్న నాయకుడు ఉండాలనే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చామన్నారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి విచ్చలవిడిగా అమ్ముతున్నారని జగన్ సర్కార్ పై పవన్ ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి వైసీపీ అనే తెగులు పట్టుకుందని తీవ్ర విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: AP Politics: వైసీపీ సర్కార్ కు ఇదే ఆఖరి దసరా.. టీటీడీ ఈవో జగన్ ఏజెంట్: బీజేపీ నేత సంచలన వాఖ్యలు
వైసీపీ తెగులు పోవాలంటే టీడీపీ-జనసేన వ్యాక్సిన్ అవసరమన్నారు. లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు తొలుత భద్రత, సంక్షేమం, అభివృద్ధి కావాలన్నారు. ఈ సమావేశంలో ప్రజల సమస్యల గురించే చర్చించామన్నారు. ప్రజలకు మేలు చేయాలనే విషయాలపై చర్చించామన్నారు. 3 విడతలుగా తమ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఉమ్మడిగా ఎలా వెళ్లాలనే దానిపై రెండో సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి గొడవలు రావని.. తాము కొట్టుకోమని స్పష్టం చేశారు. విజయదశమి రోజు తాము సమావేశం కావడం రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు. వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారని ఆరోపించారు.
బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని ఆరోపించారు. ఇంకా ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారన్నారు లోకేష్. వైసీపీ నేతల వేధింపులతో ముస్లింలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ చేతకానితనం కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుతో నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి తప్పూ చేయని చంద్రబాబును జైలులో ఉంచారని ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు లోకేష్.