Nara Lokesh Met with Amit Shah: అమిత్ షా తో భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలను ప్రస్తావించలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివరణ ఇచ్చారు. ఈ భేటీలో కేవలం కేసులపై మాత్రమే చర్చించామన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా తో భేటీ సందర్భంగా రకరకాల ప్రచారాలు జరుగుతుండటంతో మీడియా ముందుకు వచ్చారు. అమిత్ షా తో భేటీ వివరాలను మీడియాకు వెల్లడించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి అమిత్ షా కలవాలనుకుంటున్నారని తనతో చెప్పారని తెలిపారు. దాంతో హుటాహుటిన అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లానని, రాత్రి 10 గంటలకు అమిత్ షాను కలిశానని చెప్పారు లోకేష్. ఈ భేటీలో పురంధేశ్వరి, కిషన్ రెడ్డి కూడా వచ్చారని తెలిపారు. తాను హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ అడగలేదని స్పష్టం చేశారు లోకేష్. చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత తమ పార్టీ ఎంపీలు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముల అపాయింట్‌మెంట్ అడిగారని వివరించారు. ఈ నేపథ్యంలో తాను రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశానని చెప్పారు. ఇప్పుడు అమిత్ షా ను కలిశానన్నారు. కాగా, తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు నారా లోకేష్. కేవలం కేసుల అంశంపైనే చర్చించామన్నారు.
ఏకైక శత్రులు జగన్ మాత్రమే..
లా & ఆర్డర్ రాష్ట్రం పరిధిలో ఉంటుందని లోకేష్ అన్నారు. అధికారం అడ్డుకుపెట్టుకుని.. తమను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారంటూ ఏపీ సీఎం జగన్‌పై మండిపడుతున్నారు. పాదయాత్రను ఆపి.. కేసుల గురించి చర్చించి ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. 34 రోజుల్లో ఎలాంటి ఆధారాలు కూడా సంపాదించలేకపోయారని, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వం విరుచుకుపడ్డారు లోకేష్. రాష్ట్రంలో తమకు ఉన్న ఏకైక శత్రువు జగన్ మాత్రమే అని అన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్(జనసేన)తో కలిసి ముందుకు వెళ్తున్నామని మరోసారి స్పష్టం చేశారు లోకేష్.
విపక్ష నేతలను అడ్డుకుంటున్నారు?
రాష్ట్రంలో పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారని, విపక్ష నేతలు పర్యటనలు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని సీఎం జగన్ తీరుపై ఫైర్ అయ్యారు లోకేష్. యువగళం యాత్రలో 39 మంది తమ వాలంటీర్లను అరెస్ట్ చేశారని ఆరోపించారు. పాదయాత్ర మొదలైన తొలి రోజుల్లోనే తమపై రాళ్లు, ఖాళీ బాటిల్స్ వేశారని నిప్పులుచెరిగారు.
అడిగిన ప్రశ్నలివే..
తనపై నమోదైన కేసుల్లో అటార్నీ జనరల్ (ఏజీ) హైకోర్టును మిస్ లీడ్ చేశారని ఆరోపించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ అధికారులు మొదటి రోజు తనను 50 ప్రశ్నలు అడిగారని తెలిపారు. వాటిలో 5 ప్రశ్నలు మాత్రమే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినవని వివరించారు. ప్రస్తుతం హెరిటేజ్ షేర్ విలువ ఎంత అని సీఐడీ అడిగిందని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ ఎలా జరిగిందని విచారణ సందర్భంగా అడిగినట్లు తెలిపారు. ఇదే సమయంలో వైసీపీపైనా తీవ్ర విమర్శలు చేశారు లోకేష్. వైసీపీలో ఎర్రచందనం, డ్రగ్స్, గంజాయి స్మగ్లర్స్ ఉన్నారని, వైసీపీ మొత్తం క్రిమినల్స్ పార్టీ అని వ్యాఖ్యానించారు. అమిత్ షాతో తన భేటీని వైసీపీ నేతలు కావాలనే బ్లేమ్ చేస్తున్నారని విమర్శించారు లోకేష్.
Also Read:
స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇండియా,అఫ్ఘాన్ మ్యాచ్ సమయంలో ఏం జరిగిందంటే?
శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ