మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మరణాలు ఆగడం లేదు. ఇటీవల 48 గంటల వ్యవధిలో 31 మంది రోగులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే గత ఎనిమిది రోజుల్లో మరో 108 మరణాలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో ఆసుపత్రిలో పసిపాపతో సహా 11 మంది రోగులు మరణించారు. దీనిపై ఆసుపత్రి డీన్ శ్యామ్ వాకోడ్ స్పందించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేదని పునరుద్ఘాటించారు.
గత 24 గంటల్లో 1,100 మందికి పైగా రోగులను వైద్యులు తనిఖీ చేసారని, తాము 191 మంది కొత్త రోగులను ఆసుపత్రిలో చేర్చుకున్నామని తెలిపారు. గతంలో రోజుకు సగటు మరణాల రేటు 13గా ఉందని.. ఇప్పుడు 11కి పడిపోయిందని తెలిపారు. మరణాలలో పుట్టకతో వచ్చే రుగ్మతలు గల చిన్నారులు ఉన్నారని తెలిపారు. మందుల కొరత కారణంగా ఏ రోగీ చనిపోలేదని.. వారి పరిస్థితి క్షీణించడం వల్ల చనిపోయారని వాకోడ్ స్పష్టం చేశారు. ఇదిలా వుంటే.. మాజీ సీఎం అశోక్ చవాన్ నాందేడ్ ఆసుపత్రిపై మాట్లాడుతూ.. ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌లో 60 మంది శిశువులను చూసుకోవడానికి ముగ్గురే నర్సులు ఉన్నారని తెలిపారు.