Nandamuri Balakrishna: టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu)ను రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఆరోపించారు. స్కామ్‌ను జరిగినట్లు చూపించి, పొలిటికల్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. లక్షల కోట్ల భక్షక.. అవినీతి అర్చక..అంటూ జగన్‌పై తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఎవరికీ భయపడేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఇలాంటి కుట్రలు టీడీపీకి, చంద్రబాబుకు కొత్తేం కాదని అన్నారు.
తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కదా.. చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ కేసును సృష్టించారని బాలకృష్ణ ఫైర్ అయ్యారు. చంద్రబాబును జైలుకు పంపాలని పక్కా ప్లాన్ చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో కుంభకోణం జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుందన్నారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును ఎందుకు చేర్చలేదని.. కేసులో చార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. కేవలం ఓటమి తథ్యమనే భయంతోనే జగన్ ఈ కుట్రకు తెరలేపారని బాలకృష్ణ దుయ్యబట్టారు.
ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీని సర్వనాశనం చేశారని బాలకృష్ణ విమర్శలు గుప్పించారు. జగన్ సర్కారుపై బాలకృష్ణ ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని వదిలేసి.. ప్రతిపక్షాల పై కక్ష తీర్చుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. హిందూపురంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే మిగిలింది తప్ప ఇప్పుడు అభివృద్ధే లేదన్నారు. మాట తప్పని పార్టీ టీడీపీనేని..మాట తప్పకపోవడం అనేది ఎన్టీఆర్ నుంచి మా పార్టీకి వారసత్వంగా వచ్చిందని తెలిపారు. వైసీపీ పాలనపై ప్రజలు ఆలోచించాలన్నారు. ఇలాగే భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వ నాశనం అవుతుందని..సైనికుల్లా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు బాలకృష్ణ. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని సూచించారు.
Also Read: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు లాయర్లు