Telangana Elections: నాడు తండ్రులు.. నేడు తనయులు.. సాగర్‌ కా షేర్ ఎవరు?!

నల్లగొండలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈ సారి రసవత్తరమైన పోటీ జరుగనుంది. రెండుసార్లు ఓటమిపాలైన జానారెడ్డి.. ఈసారి తన తనయుడు జైవీర్ రెడ్డిని బరిలోకి దించుతున్నారు. ఇక తన తండ్రి మరణానంతరం రాజకీయ అరంగేట్రం చేసిన భగత్.. మరోసారి జానారెడ్డి ఫ్యామిలీని ఢీకొంటున్నారు.

Telangana Elections: నాడు తండ్రులు.. నేడు తనయులు.. సాగర్‌ కా షేర్ ఎవరు?!
New Update

Nagarjuna Sagar Constituency: తెలంగాణ ఎన్నికల రణరంగంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఆయా పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉన్నా గానీ.. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గం మాత్రం హాట్ సీట్‌గా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇక్కడ తండ్రుల మధ్య పోరు కాస్తా తనయుల మధ్య పోరుగా మారింది. ఈ ఎన్నికల్లో సాగర్ అడ్డాలో ఇద్దరు ఉద్దండ నాయకుల వారసులు కొట్లాడుతున్నారు. మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి స్పెషాలిటీ ఏంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

రాజకీయ పోరు.. దాయాదుల పోరును మించి ఉంటుంది. నిత్యం సంఘర్షణే. ఇక ఎన్నికలొస్తే ఆ పంచాయితీ పీక్స్‌కు చేరడం ఖాయం. ఈ విషయంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం పాలిటిక్స్ అంతకు మించి అని చెప్పుకోవాలి. వాస్తవానికి నాగార్జున సాగర్ పేరు చెప్పగానే.. బుద్ధవనం, నందికొండ, ప్రాజెక్టు, ప్రశాంత వాతావరణం, టూరిజం స్పాట్ అని అన్నీ గుర్తుకొస్తాయి. కానీ, ఇక్కడ అంతకు మించి రాజకీయం నడుస్తుంటుంది. ఎందుకంటే.. ఇక్కడ ఒకప్పుడు తండ్రుల మధ్య భీకర పోరు జరగ్గా.. ఇప్పుడు వారి తనయుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇలాంటి పోరు.. తెలంగాణలో ఏ నియోజకవర్గంలోనూ లేదిప్పుడు.

నాడు తండ్రుల మధ్య పోరు..

తెలంగాణ రాజకీయాల్లో అగ్ర నాయకుడిగా కుందూరు జానారెడ్డి పేరు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి(గతంలో చలకుర్తి) మొత్తం 12 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆయన ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలం మంత్రిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. తెలంగాణ ఏర్పాటైన తరువాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన నోముల నర్సింహయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరి.. జానారెడ్డిపై పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో జానారెడ్డే విజయం సాధించారు. ఆ తరువాత 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్(నాటి టీఆర్ఎస్) అభ్యర్థి నోముల నర్సింహయ్య విజయం సాధించారు. జానారెడ్డి ఓటమిపాలయ్యారు. అయితే, నోముల నర్సింహయ్య 2021లో హఠాన్మరణం చెందారు. దాంతో నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నర్సింహయ్య తనయుడు నోముల భగత్ పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లోనూ జానారెడ్డికి ఓటమే ఎదురైంది. వరుసగా ఎన్నికల్లో ఓటమి, వయోభారం కారణంగా జానారెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అదే సమయంలో తన తనయులను ప్రోత్సహిస్తూ వచ్చారు. తన స్థానంలో రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డిలను తీసుకువచ్చారు.

Also Read: పటేల్‌ రమేష్‌ రెడ్డి వర్సెస్ దామోదర్ రెడ్డి.. ఇద్దరి మధ్య పగ ఇదే.!

తనయుల పోరు.. సాగర్ షేర్ ఎవరు?

తండ్రుల రాజకీయ అలా ఉంటే.. ఇప్పుడు తనయుల పోరు మొదలైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నాగార్జున సాగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత నేత నర్సింహయ్య తనయుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్.. కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకుడు జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి నిలిచారు. ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం పర్వం సాగిస్తున్నారు. నాడు తండ్రి అడుగుజాడల్లో నేర్చిన రాజకీయ పాఠాలు, నేడు ఎమ్మెల్యేగా స్వయంగా తాను గడించిన అనుభవంతో నోముల భగత్ సాగర్ బరిలో దూసుకుపోతుండగా.. జానారెడ్డి రాజకీయాల్లో చేదోడువాదోడుగా ఉన్న జైవీర్ రెడ్డి తనదైన శైలిలో ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నా.. తాను మాత్రం నియోజకవర్గంలో నిత్యం పర్యటించేవాడు. గిరిజన చైతన్య యాత్ర పేరుతో నియోజకవర్గం అంతటా విస్తృతంగా పర్యటించారు. అదే ఊపును ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు.

మాటల తూటాలు..

ఇప్పుడిక ఎన్నికల ప్రచారం పర్వం షురూ అవడంతో.. ఇద్దరు యువ నేతలు సై అంటే సై అంటూ ముందుకెళ్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నియోజకవర్గానికి, ప్రజలకు ఎవరేం చేశారు? ఏం చేయలేదు?.. ఎవరి ప్రభుత్వం ఏం చేసిందనేది వివరిస్తూ ప్రజలకు చేరువ అవుతున్నారు. మొత్తంగా ఈ ఇద్దరు యువ నాయకుల పోటీతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మరి ఈ పోరులో సాగర్ బాద్‌షా గా నిలిచేది ఎవరు అనేది ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుంది.

ఎవరి బలం ఏంటంటే..

ఎన్నికల వేళ జంపింగ్స్ సర్వ సాధారణం. అసంతృప్తులు, నేతల జయాపజాయలు, అంచనాలు ఆధారంగా ద్వితీయశ్రేణి నాయకులు, పార్టీ కార్యకర్తలు పార్టీలు మారుతుంటారు. ఎన్నికల వేళ దీన్ని ఆసరాగా చేసుకున్న జానారెడ్డి వర్గం.. భగత్ వ్యతిరేక వర్గాన్ని తమవైపు లాగేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ ప్రయత్నాల ఫలితంగానే నాడు జానారెడ్డి ఓటమి తరువాత.. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన నేతలంతా ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు. ఇది కాంగ్రెస్‌కు కలిసొచ్చే ప్రధాన అంశంగా చెప్పొచ్చు. రాష్ట్ర రాజకీయాల్లోనే అగ్ర నాయకుడైన జానారెడ్డి రెండుసార్లు ఓడిపోవడంతో.. ఈసారి ఆయన తనయుడు జైవీర్ రెడ్డిని ఎలాగైనా గెలిపించి తీరాలని నాగార్జున సాగర్ కాంగ్రెస్ శ్రేణులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి.

బీఆర్ఎస్ ధీమా అదే..

నాగార్జున సాగర్‌ బరిలో మరోసారి నిలిచిన ఎమ్మెల్యే నోముల భగత్.. ప్రభుత్వ పథకాలపైనే ఆశలు పెట్టుకున్నారు. దాంతో పాటు.. బీసీ సెంట్‌మెంట్‌ను కూడా రగిలించే ప్రయత్నం చేస్తున్నారాయన. నాగార్జున సాగర్ పరిధిలో బీసీల ఓట్లు కాస్త అధికంగానే ఉన్నాయి. దాంతో భగత్ బీసీ కార్డ్ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలో గెలుపొందిన తరువాత నొముల భగత్ నియోజకవర్గం పరిధిలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమాలే విజయాన్ని అందిస్తాయని ఆయన వర్గం అంచనా వేస్తోంది. ఇక ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని కీలక నాయకులు భగత్ వెంటే ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇంకా కీలకమైన అంశం ఏంటంటే.. ఏళ్లుగా సాగర్‌లో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న జానారెడ్డికి చెక్ పెట్టింది నోముల ఫ్యామిలీనే అనే టాక్ ఉంది. అది కూడా ఆయనకు పాజిటివ్ వైబ్‌గా కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్య 7,726 ఓట్ల మెజార్టీ సాధించగా, భగత్​ 18,672 ఓట్ల మెజార్టీతో జానారెడ్డిపై గెలుపొందారు. ఇలా జానారెడ్డిని రెండు సార్లు ఓడించిన చర్రిత నోముల ఫ్యామిలీకి దక్కిందన్నమాట.

బీజేపీ నుంచి బరిలో నివేదితా రెడ్డి..

కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల పరిస్థితి అలా ఉంటే.. బీజేపీ నుంచి సాగర్ నియోజకవర్గంలో కంకణాల నివేదితా రెడ్డి బరిలో నిలుస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమెకు 2,682 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇప్పుడు మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. మునుపటిలా కాకుండా.. బీజేపీకి ఉన్న ఇమేజ్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నివేదితా రెడ్డి. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. మహిళా సెంటిమెంట్ ఆమెకు వర్కౌట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఇక్కడ బీజేపీకి బలమైన నేతలు లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీకి.. ఈసారి ప్రజలు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Also Read: కోమటిరెడ్డి బ్రదర్స్ సంగతి చూస్తా! చిరుమర్తి లింగయ్య సెన్సేషన్ కామెంట్స్..

#telangana-elections #nagarjuna-sagar-constituency #nomula-bhagath-kumar #jaiveer-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe