Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా బిజినెపల్లి మండలం మంగనురు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లి కర్కషత్వం చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. మద్యానికి బానిసై..అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కారణంగానే పిల్లలను చంపింది అని లలితపై ఆరోపిస్తున్నారు భర్త శరవంద కుటుంబ సభ్యులు.
మంగనురు గ్రామానికి చెందిన శరవంద.. పక్కనే ఉన్న లట్టుపల్లి తండాకు చెందిన లలిత 8 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, కుటుంబ అవసరాల నిమిత్తం ఒక వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకుని అక్కడే గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు భర్త శరవంద. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం పిల్లల ప్రాణాలను బలి తీసింది. లలిత తన భర్త శరబందతో గొడవ పడింది. అనంతరం భర్తపై కోపంతో రగిలిపోయిన లలిత తన నలుగురు పిల్లలు మహాలక్ష్మి(5), చరిత(4), మంజూల(3), 7 నెలల చిన్నారి మార్కెండేయను సమీపంలో ఉన్న కేఎల్‌ఐ కాల్వలోకి తోసేసింది. పిల్లల్ని కెనాల్‌లో పడేయటాన్ని గమనించిన స్థానికులు కాల్వలోకి దూకి వారిని కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది.
అయితే, గతంలోనే వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉండి లలిత ఇంటి నుండి వెళ్లిపోయిందని.. కానీ, కుటుంబ సభ్యులు, పోలీసులు నచ్చచెప్పడంతో మళ్ళీ కాపురానికి వచ్చిందని లలిత భర్త కుటుంబ సభ్యులు చెబుతున్నారు. లలిత తిరిగి ఇంటికి వచ్చిన ఆమెలో ఏ మార్పు కనిపించలేదని తెలుపుతున్నారు. పిల్లలను బడి మాన్పించి కల్లు తెప్పించు కుంటుందని భర్త శరవంద మందలించాడుట. తన అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని పిల్లల్ని కాలవలో వేసి చంపింది అని ఆరోపిస్తున్నారు శరవంద కుటుంబ సభ్యులు. కన్న పిల్లలని కనికరం లేకుండా చంపిన లలితను కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేస్తున్నారు.
కాగా భార్యాభర్తల మధ్య వివాదంలో ముక్కుపచ్చలారని పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి. దంపతుల వివాదంలో పిల్లలు బలైపోతున్నారు. అసలు లలిత పిల్లల్ని ఎందుకు చంపింది? అక్రమ సంబంధమే కారణమా? లేదంటే భర్త వేధింపులు భరించలేక చంపిందా? వంటి ప్రశ్నలకు జవాబు తెలియాల్సి ఉంది.