ప్రపంచంలోని టాప్-50 స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్ జాబితాలో భారత్ కు చెందిన మూడు స్వీట్స్ కు చోటు లభించింది. ఫుడ్ ర్యాంకింగ్ ప్లాట్ ఫారమ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన జాబితాలో మైసూర్ పాక్, కుల్ఫీ, కుల్ఫీ ఫలూదాలు టాప్ 50లో నిలిచాయి. ఇందులో కర్ణాటకకు చెందిన ఫేమస్ స్వీట్ మైసూర్ పాక్ 4.4 రేటింగ్‌తో 14 స్థానం దక్కించుకుంది.
ఆ తర్వాత స్థానంలో 4.3 రేటింగ్‌తో కుల్ఫీ 18వ ర్యాంకు పొందింది. ఇక కుల్ఫీ ఫలూడా 4.1 రేటింగ్‌తో 32వ స్థానంలో నిలిచింది. మైసూర్ పాక్‌కు ప్రపంచంలోని టాప్ 50 స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్ జాబితాలో 14 స్థానం దక్కడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపును చూసి కన్నడిగులు గర్వపడుతున్నారని అన్నారు.
90 ఏండ్ల క్రితం మైసూరు రాజు క్రిష్ణ రాజు వడయార్ దగ్గర మాదప్ప అనే వ్యక్తి రాయల్ చెఫ్ గా పని చేశారు. ఒక రోజు కృష్ణ రాజు వడయార్ భోజనానికి కూర్చోగా ఆయనకు వడ్డించేందుకు స్వీట్లు ఏమీ లేవని మాదప్ప గుర్తించారు. ఆ సమయంలో ఆయకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడే శనగ పిండి, చెక్కెర, నెయ్యితో మైసూర్ పాక్ తయారు చేశారు. అప్పటి నుంచి స్వీట్ చాలా ఫేమస్ అయింది.
ప్రపంచ టాప్ -50 స్వీట్లలో మైసూర్ పాక్ కు చోటు లభించడంపై మాదప్ప మనుమడు శివానంద స్పందించారు. మైసూర్ పాక్ లభించిన ఈ గుర్తింపు కన్నడిగులందరికీ గర్వకారణమని చెప్పారు. ఈ విషయం భారతీయులందరూ గర్వించదగినదని పేర్కొన్నారు. మొదట్లో ఈ స్వీట్ కు పేరు పెట్టలేదని చెప్పారు. ఆ తర్వాత దానికి మైసూర్(రాజ్యం పేరు) పాక్ (స్వీట్) అని పేరు పెట్టారని శివానంద వివరించారు.