ఐదుగురు మృతి.. మరికొందరికి తీవ్రగాయాలు?
సూర్యాపేట జిల్లాలోని మేళ్ల చెరువులోని మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కింద పడటంతో ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ముమ్మరం చేశారు.
అనుమతులు లేకుండా నిర్మాణం?
500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లిఫ్ట్ కుప్పకూలడంతో అందులో ఉన్న ఐదుగురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందారు. ముగ్గురు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీయగా.. మరో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరికొంత కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దాంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. కొత్తగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితులను యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. ఒక్కసారిగా కంపెనీలో ప్రమాదం జరగడంతో కార్మికులు ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ప్రమాదంపై మైహోం యాజమాన్యం గోప్యత పాటిస్తోంది.
అనుమతుల కోసం ఫోర్జరీ పత్రాలు?
మేళ్లచెరువు సర్వేనెంబర్ 1057లో మైహోమ్ సిమెంట్ సంస్థ ప్లాంట్ నిర్మాణాలు చేపట్టింది. ఇందుకు నిర్మాణ అనుమతులు ఇవ్వాలంటూ జూపల్లి రంజిత్ రావు పేరిట మైహోమ్ సంస్థ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంది. అయితే ప్రతిపాదిత భూమిలో ఇప్పటికే భవనాలు ఉండటంతో పాటు కోర్టు కేసులు కూడా ఉండటంతో ఐదు సార్లు గ్రామ పంచాయతీ అధికారులు ఈ దరఖాస్తును తిరస్కరించారు. పంచాయతీరాజ్ శాక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఈ విషయంలో కలుగజేసుకున్నారని.. మైహోమ్ సంస్థకు అన్ని అనుమతులు జారీచేయాలని హుకుం జారీచేశారని సమాచారం. దీంతో మరోసారి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈసారి ఫోర్జరీ పత్రాలు కూడా సృష్టించినట్లు తెలుస్తోంది.