Nizamabad: పెళ్లి విందులో మటన్ ముక్కల కోసం బొక్కలు ఇరగొట్టుకున్న సంఘటన నిజమాబాద్ జిల్లాలో జరిగింది. వరుడు, వధువు బంధువులు ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడులు చేసుకున్నారు. తలలు పగిలి, కాళ్లు చేతులు విరిగేలా నెత్తురు కారేదాకా కొట్టుకున్నారు. ఈ గొడవలో పలువురు యువకులతోపాటు చిన్న పిల్లలు గాయపడగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
19 మందిపై కేసు నమోదు..
ఈ మేరకు ఎస్సై వినయ్, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నవీపేటకు చెందిన అమ్మాయితో నందిపేట మండలానికి చెందిన అబ్బాయికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌హాలులో పెళ్లి జరిగింది. అయితే విందులో మటన్ ముక్కలు తక్కువ వేస్తున్నారంటూ.. వరుడు తరఫున పెళ్లికి వచ్చిన కొంతమంది యువకులు వడ్డించడం మొదలుపెట్టారు. దీంతో వధువు బంధువులు అలా చేయొద్దని వాదించిన వినకుండా అలాగే వడ్డించడంతో గొడవ మొదలైంది. దీంతో మాట మాట పెరిగి కూర గంటెలు, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఫంక్షన్ హాల్ కు చేరుకుని ఇరువర్గాలను కంట్రోల్ చేశారు. ఈ గొడవలో ఇరు పక్షాలకు సంబంధించి 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. గాయపడినవారిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.