Music Shop Murthy : మ్యూజిక్ షాప్ మూర్తి రివ్యూ.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

సీనియర్ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి. చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఫ్యామిలీ డ్రామా ఆడియన్స్ కి కనెక్ట్ అయిందా? లేదా? అనేది మన సమీక్షలో తెలుసుకుందాం పదండి..

New Update
Music Shop Murthy : మ్యూజిక్ షాప్ మూర్తి రివ్యూ.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

Music Shop Murthy Movie Review : రెగ్యులర్ హీరో హీరోయిన్ విలన్ అంటూ కమర్షియల్ చిత్రాలను చూసి బోర్ కొట్టేసి ఉన్నారు ఆడియెన్స్. అలాంటి ప్రేక్షకులను ఊరట నిచ్చేలా మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy) అనే చిత్రం వచ్చింది. అజయ్ ఘోష్ (Ajay Gosh), చాందినీ చౌదరీ (Chandini Chowdary) లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శివ పాలడుగు తెరకెక్కించాడు. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ చూస్తేనే కథ ఏంటో అందరికీ అర్థమై ఉంటుంది. మరి అలాంటి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
వినుకొండలో మూర్తి(అజయ్ ఘోష్) అనే ఓ యాభై ఏళ్ల వ్యక్తి మ్యూజిక్ షాప్ అంటూ క్యాసెట్లు అమ్ముతూ ఉంటాడు. క్యాసెట్ల కాలం ఎప్పుడో పోయినా కూడా అతనికి నచ్చిన, వచ్చిన పని అదొక్కటే. సంగీతంపై ఆయనకు మక్కువ ఉంటుంది. కానీ ఆ మ్యూజిక్ షాప్‌తో ఫ్యామిలీని పోషించడం కష్టం అవుతుంటుంది. అతనికి తోడు భార్య (ఆమని) కూడా పని చేస్తూ కష్టపడుతుంటుంది. డీజే అయితే ఎక్కువ డబ్బులు వస్తాయని తెలుసుకున్న మూర్తి ఆ దిశగా అడుగులు వేస్తాడు. ఇదే క్రమంలో డీజే అవ్వాలనుకునే అంజనా(చాందిని) పరిచయం అవుతుంది. కానీ ఓ ఆడిపిల్ల అలా పబ్బుల్లో డీజే వాయించడం ఇష్టం లేని అంజనా తండ్రి ఆమెను వ్యతిరేకిస్తుంటాడు. ఈ క్రమంలోనే మూర్తితో అంజనా పరిచయం జరుగుతుంది. ఆ తరువాత మూర్తి, అంజనాల ప్రయాణం ఎలా సాగింది? ఈ ఇద్దరి గురించి సమాజం ఏం మాట్లాడుకుంది? మూర్తికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు డీజే కావడంలో అంజన ఎలా సాయం చేసింది? మూర్తి ఎన్ని కష్టాలు పడ్డాడు? చివరకు మూర్తి తాను అనుకున్నది సాధించాడా? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు
అజయ్ ఘోష్‌ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెరపై మనం ఆయన్ను ఇంత వరకు విలన్‌గా చూసి భయపడ్డాం, కమెడియన్‌గా చూసి నవ్వుకున్నాం. కానీ ఇందులో తన నటనతో ఏడ్పించేశాడు. ఓ మిడిల్ క్లాస్ మామూలు తండ్రిని చూసినట్టుగానే కనిపిస్తాడు.. అనిపిస్తాడు. అజయ్ ఘోష్ ఈ చిత్రంలో నవ్వించడంతో పాటుగా మనసుల్ని కదిలించేలా నటించేశాడు. క్లైమాక్స్‌లో అందరినీ ఏడ్పించేస్తాడు. మోడ్రన్ అమ్మాయిగా, ట్రెండీ లుక్కులో చాందిని చక్కగా కనిపించి..నటించింది. మళ్లీ శుభలగ్నం, ఆ నలుగురు నాటి ఆమనిని చూసినట్టుగా అనిపిస్తుంది. ఆమని మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అమిత్ శర్మ, భాను చందర్. దయానంద్ రెడ్డి, పటాస్ నాని ఇలా అందరూ తమ తమ పరిధి మేరకు మెప్పిస్తారు.

విశ్లేషణ
మ్యూజిక్ షాప్ మూర్తి కథ, కథనం ఏమీ కొత్తగా ఉండదు. రెగ్యులర్ సినిమా అయితే.. మిడిల్ క్లాస్ హీరో.. ఫ్యామిలీ కష్టాలు.. హీరోయిన్ సాయం.. హీరో కన్న కలను సాధించడం కోసం పడే కష్టాలు.. అనే కథతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కూడా అదే కోవలోకి వస్తుంది. కానీ ఇక్కడ హీరో, హీరోయిన్ల ట్రాక్‌కి బదులు ఓ కొత్త ట్రాక్ రాసుకున్నాడు. పాతికేళ్ల కుర్రాడి కథ చెప్పలేదు.. యాభై ఏళ్ల మూర్తి కథను చెప్పాడు. ఇక్కడ అదే కొత్త పాయింట్. ఆ కొత్త పాయింట్తోనే సినిమా మీద ఆసక్తి పెంచినట్టు అయింది.

యాబై ఏళ్ల మూర్తి పాత్ర, పాతికేళ్ల అంజన పాత్రల ట్రాక్ చాలా ఫ్రెష్‌గా, కొత్తగా ఉంటుంది. వారి మధ్య స్నేహం అందరినీ ఆలోచింపజేస్తుంది.. ఆకట్టుకుంటుంది. కానీ సమాజం మాత్రం వేరేలా చూస్తుంది. అలా సమాజాన్ని కూడా ప్రశ్నించినట్టుగా అనిపిస్తుంది. తండ్రి అనేవాడు ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు అనేది ఇందులో చక్కగా చూపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు.. వారి మెంటాల్టీ ఎలా ఉంటుందో చూపించాడు. దర్శకుడు ఈ కథను ఊహించి కాకుండా.. అనుభవించి రాసినట్టుగా, తీసినట్టుగా ఉంటుంది.

ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా నవ్వించి తీసుకెళ్లినట్టుగా ఉంటుంది. ఇంటర్వెల్‌కు ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. సెకండాఫ్‌లో ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. డీజే అవ్వడానికి మూర్తి చేసిన పనులు మనసును మెలి పెడతాయి. అతను పడ్డ కష్టాలు చూస్తుంటే కదిలిపోవాల్సిందే. ఇక క్లైమాక్స్‌లో మళ్లీ ఏడిపించేస్తారు. ఇలాంటి మూవీకి టెక్నికల్ టీం బాగా సపోర్ట్ ఇచ్చింది. విజువల్స్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఆర్ఆర్ ఏడిపిస్తుంది. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్లు బాగా పని చేశాయి. మొదటి సినిమా అని, చిన్న సినిమా అని అనుకోకండా నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. దానికి తగ్గ అవుట్ పుట్ కూడా వచ్చింది.

రేటింగ్ 3/5

Also Read : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘లవ్ మీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Advertisment
తాజా కథనాలు