కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మునుగోడులో తన గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. వలసలతో అధికార పార్టీని (BRS Party) ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆయన స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వారిలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, నాంపల్లి జెడ్పీటీసీ ఏలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూప రవి, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, నాంపల్లి వైసీపీ ఎంపీపీ పానుగంటి రజిని వెంకన్న గౌడ్, మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణా లింగస్వామి గౌడ్ తదితరులు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ను వీడినట్లు ఈ నేతలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: TS BJP: బీజేపీలోకి మళ్లీ రాజగోపాల్ రెడ్డి.. సీఎం రేసులో బండి సంజయ్: మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు
బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన తర్వాత నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డికి అంతగా సానుకూల వాతావరణం లేదన్న టాక్ నడిచింది. దీంతో అలర్ట్ అయిన రాజగోపాల్ రెడ్డి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను గుర్తించి వారిని పార్టీలో చేర్చుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ లోకి వలసలు మరిన్ని ఉంటాయన్న ప్రచారం సాగుతోంది.