మంత్రి వేణు వర్సెస్ ఎంపీ బోస్..
రామచంద్రపురం వైసీపీలో మంత్రి వేణుగోపాల్, ఎంపీ సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇరు వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా మంత్రి వేణు వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రిగా వేణు బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనను సన్మానించేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేశారు. అయితే ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడంపై చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ మంత్రి వేణుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతోంది.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా..
వేణుకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. అవసరమైతే తాను లేదా తన కుమారుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు దగ్గర వేణు ఎన్ని రోజులు నటిస్తారని ప్రశ్నించారు. వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి సీఎం జగన్‌తోనే ఉన్నామని గుర్తుచేశారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వేణు ఎంజాయ్ చేస్తానున్నారని విమర్శించారు. వేణుతో సమావేశం ఏర్పాటుచేస్తానని జగన్ చెప్పారని.. అయితే క్యారెక్టర్ లేని వ్యక్తితో కలిసి తాను కూర్చోనని చెప్పినట్లు తెలిపారు. ఈ విషయంలో తనను ఇబ్బంది పెట్టొద్దని జగన్‌కు వివరించానని పేర్కొన్నారు.
టీడీపీలో చేరేందుకు సిద్ధం?
ప్రస్తుతం బోస్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోవైపు వైసీపీని వీడి టీడీపీలో కూడా బోస్ చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బోస్ వంటి బలమైన నాయకుడు పార్టీలోకి వస్తే వెంటనే ఆహ్వానించి పార్టీ తరపున టికెట్ కూడా ఇచ్చేందుకు రెడీ అయినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బోసు తనయుడు పిల్లి సూర్యప్రకాష్ మంత్రి వేణుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాగా కొన్నిరోజుల క్రితం బోస్ వర్గీయలు ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మంత్రి వేణుపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. మరి ఈ పరిణామాలు నియోజకవర్గ వైసీపీలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో వేచి చూడాలి.