Bandi Sanjay: ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్వాగతించారు. అయితే తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడంపై సందేహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో గత పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేచి చూస్తున్నాయి. వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు’’ అని ప్రశ్నించారు. తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని కోరారు. బీఆర్ఎస్ మాదిరిగా చేతులు దులుపుకోకుండా నిష్పక్షపాతంగా పథకాలు అమలు చేయాలన్నారు. పథకాల అమలులో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: మోదీ హ్యాట్రిక్ కన్ఫర్మ్!.. ఏబీపీ సీ-ఓటర్ సంచలన సర్వే
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని పార్టీ జిల్లా కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవంలో పాల్గొన్న ఆయన వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విలువల విషయంలో రాజీ పడకుండా పదవులను త్రుణప్రాయంగా వదిలేసుకున్న మహానాయకుడని వాజ్‌పేయిని కొనియాడారు.
బీఆర్‌ఎస్ పోటీనే కాదు
అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తమకు పోటీదారే కాదని అన్నారు బండి సంజయ్. ఎంపీ ఎన్నికలంటేనే మోదీ ఎన్నికలన్న భావన ప్రజల్లో ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్నారు. ప్రజలు ఓడించినా కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు. కాంగ్రెస్ శ్వేతపత్రం, బీఆర్‌ఎస్ స్వేదపత్రం రెండూ అంటూ అక్షరాలు మార్చి ఒకరి పత్రాలు ఒకరు విడుదల చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం నిధులు మళ్లించింది
కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం మళ్లించిందని ఆరోపించారు. వైకుంఠధామాలు సహా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, బస్తీ దవాఖానాలు, జాతీయ రహదారుల నిధులన్నీ కేంద్రానివే అన్నారు. చివరకు పంచాయతీల నిధులు దారి మళ్లించి సర్పంచులకు బిల్లులివ్వకుండా దివాళా తీయించారని విమర్శించారు. జీతాలివ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంటే, కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చిందని, అంత సంపదను ఎలా సృష్టిస్తారని ప్రశ్నించారు. తబ్లిగ్ జమాతే సంస్థ సమావేశాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడాన్ని సంజయ్ తప్పుబట్టారు.