బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీకి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరైన విషయం విధితమే. అయితే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా విపక్షాల ఐక్యత కోసం ఆమె ఆ సమావేశంలో పాల్గొనడంపై ప్రశంసలు వస్తున్నాయి. ప్రత్యేక విమానంలో ఆమె బ్రీతింగ్ మాస్క్ పెట్టుకుని ప్రయాణిస్తున్న ఫొటో రాహుల్ గాంధీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఇంత ఒత్తిడిలో కూడా అమ్మ పోరాటపటిమను ప్రశంసిస్తూ ఆ పోస్టులో వ్యాఖ్యానించారు. బెంగళూరులో విపక్షాల సమావేశం ముగిసిన తర్వాత మంగళవారం సాయంత్రం తిరిగి ఢిల్లీ బయల్దేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపంతో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అనంతరం మరో విమానంలో ఢిల్లీ తిరిగి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమె మాస్క్ పెట్టుకుని ప్రయాణించారు.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలు..
గత జనవరిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ రెండో దశలో పాల్గొన్న సోనియా స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా సోకినప్పటి నుంచి ఆమె వరుసగా అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. గతంలోనూ అనారోగ్యం కారణంగా ఆమెరికా వెళ్లి చికిత్స కూడా చేయించుకున్నారు. ఆరోగ్యం సహరించక ఇంతకుముందులా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు.
ముంబై సమావేశంపై అందరి దృష్టి..
బిహార్ రాజధాని పట్నాలో విపక్షాల భేటీ తర్వాత కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన భేటీ కూటమికి ఓ రూపునిచ్చింది. బెంగళూరులో రెండ్రోజులు సమావేశమైన 26 రాజకీయ పార్టీలు తమ కూటమికి I-N-D-I-Aగా నామకరణం చేశాయి. అయితే ఈ పేరు బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు నచ్చలేదని తెలుస్తోంది. పేరులో N D A ఉండటంతో ప్రజలకు N D A కూటమి గుర్తుకువస్తుందేమో అని అభిప్రాయపడ్డారు. కానీ మెజార్టీ నేతలు I-N-D-I-Aకే మొగ్గు చూపడంతో ఆయన కూడా అంగీకరించక తప్పలేదు. తదుపరి భేటీ ముంబైలో జరగబోతుందని కూడా ప్రకటించారు. ఇప్పుడు అందరి దృష్టి ముంబైలో జరగనున్న మూడో సమావేశంపై పడింది. ఇందులో కూటమి సారథి, వచ్చే ఎన్నికల్లో బీజేపీలో పోరాటంలో ఉమ్మడి కార్యాచరణ ఖరారు చేయడం పెద్ద సవాలుగా మారనుంది.