Hero Sushanth: టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున సోదరి నాగ సుశీల కుమారుడు హీరో సుశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హీరో సుశాంత్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రయంపై ఈ నెల 12న హీరో సుశాంత్ , అతని అనుచరులు దాడికి పాల్పడ్డారట. 50 మంది గుండాలతో ట్రస్ట్ లోకి ఎంటర్ అయ్యి సీసీ కెమెరాలు పగుల గొట్టి ట్రస్ట్ లో ఉన్న వారిపై బూతులతో విరుచుకుపడ్డారని వాపోయాడు బాధితుడు శ్రీనివాస్. దర్శపీఠ నిర్వాహకులు శ్రీనివాసరావుపై వీరు దాడి చేశారని ఆరోపిస్తూ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాగ సుశీలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
2005లో మొయినాబాద్ లోని చిన్న మంగళవారం గ్రామంలో శ్రీనివాస్ తో పాటు నాగ సుశీల రెండు ఎకరాల స్థలాన్ని తీసుకున్నారట. అయితే నాగ సుశీలకు ఈ రెండు ఎకరాల స్థలంలో 30% వాటా ఉందని.. ఆ వాటా కూడా ఆమె ఇతరులకు అమ్ముకుందని బాధితుడి తెలిపాడు. ఆ తర్వాత తాను మరో 10 గుంటల స్థలాన్ని పక్కనే కొనుగోలు చేశానని..అయితే, ఆ 10 గుంటల స్థలాన్ని ప్రకృతి ధర్మ పీఠం అనే ట్రస్ట్ కి గిఫ్ట్ చేశానని వెల్లడించాడు. కాగా, ఆ ట్రస్ట్ ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలన్న ఆశతో హీరో సుశాంత్ దాడికి తెగబడ్డారని బాధితుడు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడట.
అయితే గతంలో ప్రముఖ నిర్మాత, అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన వ్యాపార భాగస్వామిపై క్రిమినల్ కేసు పెట్టారు. తమకు తెలియకుండా తమ భూమిని విక్రయించారని ఆరోపిస్తూ నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నాగసుశీల ఫిర్యాదు చేశారు. తన భూమిని విక్రయించి నగదు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
నాగసుశీల, శ్రీనివాసరావు చాలా ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వీరిద్దరూ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు సినిమాలు కూడా నిర్మించారు. సుశాంత్‌ను హీరోగా పెట్టి నాగసుశీల, శ్రీనివాసరావు కలసి శ్రీనాగ్ కార్పోరేషన్ బ్యానర్‌పై మూడు సినిమాలు నిర్మించారు. వాటిలో ‘కరెంట్’ సినిమా ఫర్వాలేదనిపించినా.. ఆ తరవాత వచ్చిన ‘అడ్డా’ ఫ్లాపయ్యింది. ఇక మూడో ప్రయత్నంగా నిర్మించిన ‘ఆటాడుకుందాం రా’ ఎప్పుడొచ్చిందో వెళ్లిందో కూడా తెలియలేదు. అప్పటికే భూమి విషయంలో వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు ఈ సినిమా పరాజయంతో మరింత ఎక్కువైనట్లు సమాచారం. ఈ సినిమా కోసం శ్రీనివాసరావు రూ.5 కోట్లు సమకూర్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమా పరాజయంతో నష్టం రావడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని శ్రీనివాసరావు ఆరోపించిన్నట్లు సమాచారం.