మోడీ ఇంటిపేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో సెషన్స్ కోర్టు విధించిన రెండు సంవత్సరాల శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ వేసిన స్టే పిటిషన్ను గుజరాత్ హైకోర్టు జూలై 7న కొట్టివేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గాంధీ పిటిషన్‌ను విచారించేందుకు జూలై 18న అంగీకరించింది. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కేసును త్వరగా విచారించాలని కోరారు.
తీర్పుపై స్టే ఇవ్వకపోతే, అది “స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛాకు విఘాతం కలిగిస్తుంది” అని రాహుల్ గాంధీ తన అప్పీల్‌లో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించకపోతే, అది ప్రజాస్వామ్య వ్యవస్థలను క్రమబద్ధంగా, పునరావృతమయ్యేలా నిర్వీర్యం చేయడానికి దోహదపడుతుందని, ఫలితంగా ప్రజాస్వామ్యం ఉక్కిరిబిక్కిరి అవుతుందన్నారు. ఇది భారతదేశ రాజకీయ వాతావరణం, భవిష్యత్తుకు తీవ్ర హానికరమని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
కాగా 2019లోకసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్నాటకలోని కోలార్ లో రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఈ పరువునష్టం కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు...రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ శిక్షపై తీర్పు ఈ ఏడాది మార్చిలో వెలువరించింది. ప్రజాప్రాతినిద్య చట్టం 1951 ప్రకారం పార్లమెంట్ సభ్యులు ఏదైనా కేసులో దోషిగా రుజువైనట్లయితే...కనీసం రెండేళ్ల శిక్ష పడినట్లయితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించిన 24 గంటల్లోనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోకసభ సెక్రెటెరియల్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దయ్యింది.
దీంతో సెన్షన్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆయనకు కిందికోర్టు శిక్షను విధించడాన్ని హైకోర్టు సమర్ధించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ రాహుల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.