CM Revanth Reddy: ప్రతి మెడిసిన్కూ కాల వ్యవధి ఉన్నట్టే ప్రధానిగా మోదీకి కూడా కాలం చెల్లిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాగపూర్ లో కాంగ్రెస్ ఆవిర్భావ సభకు హాజరైన ఆయన తన ప్రసంగంలో కీలక అంశాలు ప్రస్తావించారు. లోకసభలో రాహుల్ గొంతు విప్పడంతో ఆదానీ ఇంజిన్ షెడ్డుకు పోయిందని, ఇప్పుడు భారత న్యాయయాత్రతో ప్రధాని ఇంజిన్ కూడా ఆగిపోయి షెడ్డుకు పోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విశేష ఫలితాలనిచ్చిందన్నారు. 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లకు పైగా సాగిన యాత్ర ఫలితంగా కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ అధికారం సాధించిందని; త్వరలోనే మహారాష్ట్రలోనూ ఇదే పునరావృత్తం కాబోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి జోస్యం చెప్పారు.
ఇక ఇప్పుడు రాహుల్ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు తలపెట్టిన భారత న్యాయ యాత్రతో ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరడం ఖాయమని, ప్రధాని మోదీ కూడా దాన్ని ఆపలేరని స్పష్టంచేశారు.
వంద రోజులు దేశం కోసం పనిచేయండి
వంద రోజుల పాటు దేశం కోసం పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా నిర్విరామంగా పనిచేయాలని కోరారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం ద్వారా దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: అభయహస్తం అప్లికేషన్లపై కాంగ్రెస్ కీలక ప్రకటన.. అలా మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి!