ఢిల్లీ నగరంలో జీ 20 సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. సమావేశాలు ప్రారంభానికి ముందు మొరాకాలో భూకంపంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. అనంతరం ఆయన ప్రసంగం ప్రారంభించారు. ప్రజలందరూ కూడా నమ్మకంతో ఉండాలన్నారు.
ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా వల్ల ప్రజలకు అపనమ్మకం ఎక్కువ అయ్యింది అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా ప్రజలు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయారు. మనం ఏ పని చేసినా కూడా పూర్తి నమ్మకం, విశ్వాసంతో కలిపి ప్రపంచ మేలు కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు.
ప్రపంచంలో ఉన్న పాత కాలం నాటి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన సమయంలో మనమంతా ఉన్నామంటూ, మానవతా దృక్పథంతో మన బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. భారతీయులందరూ కలిసి ప్రపంచానికి 21 వ శతాబ్ధంలో కొత్త మార్గాన్ని చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
'' ప్రజలందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. కరోనా వంటి మహమ్మారిని కూడా ఎంతో ధైర్యంగా ఓడించామని చెప్పారు. అత్యంత ప్రమాదకరమైన సవాలును కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాం'' అని ప్రధాని మోడీ చెప్పారు. '‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్’ అనే భారత నినాదాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు.
జీ 20 కి భారత్ నాయకత్వం వహించే స్థాయికి చేరిందని పేర్కొన్నారు. ఇది ప్రజల జీ 20 సదస్సు..ఇందు కోసం 60 కి పైగా నగరాల్లో 200 కు పైగా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ప్రపంచానికి మంచి చేసేందుకు మనమంతా కలిసి పని చేయాలంటూ మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే జీ 20 సమావేశాల్లో మరో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. దేశం పేరును మార్చుతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ..ఆల్ మోస్ట్ పేరును మార్చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న రాష్ట్రపతి విందు ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. ఈ క్రమంలోనే ఇండోనేషియా పర్యటనకు వెళ్లిన మోడీ గురించి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ప్రచురించారు.
ఈ రోజు జరిగిన సమావేశాల్లో కూడా మోడీ కూర్చుని ఉన్న సీటు ముందు భారత్ అని ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే ఇండియా పేరును భారత్ గా మార్చడానికే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఈ నెల 18 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.