/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/dasoju-sravan-jpg.webp)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమావేశమైన తెలంగాణ కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను శాసనమండలికి పంపేందుకు ఆమోదం తెలిపింది. బలహీన వర్గాలకు చెందిన శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యానారాయణలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రతిపాదనను వెంటనే గవర్నర్‌కు పంపించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేబినెట్ ఆమోదం తెలిపిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించే అవకాశమే లేదన్నారు. మరోవైపు గతంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిప్పి పంపిన మూడు బిల్లులను కూడా ఆగస్టు 3 నుంచి నిర్వహిచబోయే అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ తీర్మానం చేసి పంపుతామని కేటీఆర్ వెల్లడించారు. రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదన్నారు.
దాసోజు శ్రవణ్ ప్రొఫైల్..
నార్కట్‌పల్లి మండలం యల్లారెడ్డిగూడెనికి చెందిన దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆయన 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి పొలిట్‌బ్యూరో స్థాయికి ఎదిగారు. 2014లో గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా యాక్టివ్‌గా ఉండేవారు. పార్టీ అధికారి ప్రతినిధిగా ప్రెస్‌మీట్లలో ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ కీ రోల్ ప్లే చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కేవలం 33,549 ఓట్లతో మూడో స్థానానికే పరిమతమయ్యారు. అయితే తన ప్రత్యర్థి అయిన దివంగత మాజీ మంత్రి పి.జనార్ధన్‌రెడ్డి కుమార్తె, బీఆర్ఎస్ కార్పోరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన హస్తానికి మొండిచెయ్యి చూపించారు. అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ కాషాయం విధానాలు నచ్చకపోవడంతో మూడు నెలల కాకుండానే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత పరిణామాలతో అధికార బీఆర్ఎస్‌లో చేరారు.
దానంకు లైన్ క్లియర్..
శ్రవణ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడంలో సీఎం కేసీఆర్ తన చాణక్యం ప్రదర్శించారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు శ్రవణ్ కూడా బీఆర్ఎస్‌తో ఉండటంతో కొంతకాలం టికెట్ల లొల్లి కొనసాగుతోంది. దీంతో గులాబీ బాస్ చాకచక్యంగా వ్యవహరించి దాసోజును శాసనమండలికి పంపాలని నిర్ణయించడంతో దానంకు లైన్ క్లియర్ అయింది.