MLC Kavitha: బీఆర్ఎస్ బ్యానర్ పక్కన పెట్టేసిన కవిత.. ఎందుకోమరి.. 

ఎమ్మెల్సీ కవిత ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో కనిపించలేదు. అలాగే ఆమె భారత జాగృతి పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జెండా కనిపించలేదు. ఎందుకలా అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తికర చర్చను లేవనెత్తుతోంది.

MLC Kavitha: బీఆర్ఎస్ బ్యానర్ పక్కన పెట్టేసిన కవిత.. ఎందుకోమరి.. 
New Update

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఈమె రూటు ఎప్పుడూ సపరేటు. కేసీఆర్ కుమార్తెగా.. బీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేక హోదాలో ఉన్నారామె. నిజానికి టీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటం సమయంలో కవిత తెలంగాణ జాగృతి పేరుతో ప్రత్యేకంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. బతుకమ్మ పండుగకు జాతీయస్థాయిలో ప్రాధాన్యత రావడానికి ఒకవిధంగా తెలంగాణ జాగృతి పేరుతో కవిత చేసిన కృషి పెద్ద కారణంగా చెబుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం.. కాలక్రమంలో కేసీఆర్ దానిని బీఆర్ఎస్ గా మార్చడం.. తరువాత ఇప్పుడు అధికారం కోల్పోవడం వరుసగా జరిగిపోయాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి పేరుతో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)చేసిన పోరాటం.. తెలంగాణ ఆవిర్భావంతో ఆగిపోయిందని చెప్పాలి. తరువాత ఎదో కొన్ని సందర్భాలలో తప్పితే తెలంగాణ జాగృతి బేనర్ బయటకు తీయలేదని చెప్పొచ్చు. అయితే, బీఆర్ఎస్ లానే తన తెలంగాణ జాగృతిని కూడా భారత జాగృతిగా మార్చారు కవిత. 

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, తాజగా ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మళ్ళీ భారత జాగృతి సంస్థను జాగృతం చేస్తున్నారా? బీఆర్ఎస్ కు సమాంతరంగా దీనిని నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే, ఇటీవల కాలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యక్రమాలలో కవిత కనిపించలేదు. అలాగే, కవిత ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ జెండాలు ఆ కార్యక్రమాల్లో కనిపించలేదు అని వారు ఎత్తి చూపిస్తున్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మిగిలిపోయాకా.. రెండు పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న అవినీతి విమర్శలను తిప్పి కొట్టడానికి చలో మేడిగడ్డ పేరుతో బీఆర్ఎస్ పెద్ద కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ లోని ముఖ్యనాయకులు అందరూ హాజరు అయ్యారు. కానీ, కవిత(MLC Kavitha) అక్కడ కనిపించలేదు. ఇక ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలంటూ బీఆర్ఎస్ మొన్నటికి మొన్న ఒక కార్యక్రమం నిర్వహించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. బీఆర్ఎస్ నాయకులు అంతా ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కానీ, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ రెండు ఉదాహరణలు చాలు బీఆర్ఎస్ బ్యానర్ ను  కవిత దూరం పెడుతున్నారు అని చెప్పుకోవడానికి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడానికి కారణం తానూ గుడికి వెళ్లానని ఎక్కడో మీడియాతో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. 

Also Read: బీఆర్ఎస్‌కు మరో షాక్… బీజేపీలోకి మాజీ ఎంపీ!

ఇక ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఇటీవల సపరేటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అదే విమర్శలకు దారి తీస్తోంది. అనుమానాలకు తావిస్తోంది అని అంటున్నారు. గతంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని ధర్నా నిర్వహించారు కవిత. ఇది భారత జాగృతి పేరుమీదనే నిర్వహించారు. అక్కడ భారత జాగృతి పేరుతోనే కార్యక్రమం నడిచింది. నిజానికి అక్కడ  బీఆర్ఎస్ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు సీపీఐ, సీపీఎం నాయకులూ పాల్గొన్నారు. కానీ, భారత జాగృతి ఆధ్వర్యంలోనే కార్యక్రమం జరిగింది. ఇక ఇప్పుడు జీవో నంబర్ 3కి వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నారు కవిత. దీనిని కూడా భారత జాగృతి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నాట్టు ప్రకటించారు. అలాగే దానిని నిర్వహించారు. 

బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనకుండా.. ఇలా భారత జాగృతి పేరుతో ప్రత్యేకంగా కార్యక్రమాలు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) నిర్వహిస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదే విషయాన్ని రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ.. భారత జాగృతి పేరుతొ కార్యక్రమాలు నిర్వహిస్తే దీనిపై మాట్లాడుకునే అవసరమే ఉండేది కాదు.. కానీ, పార్టీ కార్యక్రమాల్లో కనిపించకుండా.. సొంత సంస్థ బేనర్ తో కార్యక్రమాలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది అంటున్నారు. రాజకీయాల్లో చిన్న విషయాలను పెద్దగా చూడటం.. చూపించడం సహజమే. అదేవిధంగా ఇది చిన్న విషయంగా మిగిలిపోతే ఫర్వాలేదు. కానీ, ఎమ్మెల్సీ కవిత అందరూ అనుకుంటున్నట్టుగా సొంత ఎజెండా తో పనిచేస్తే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేగుతుందనేది వాస్తవం అని రాజకీయ విశ్లేషకుల మాట. 

ఎమ్మెల్సీ కవిత ధర్నా కార్యక్రమం ఇక్కడ చూడొచ్చు:

#bharata-jagruthi #kavitha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe