ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్ష నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వాలంటీర్లను పవన్ అనుమానించడం బాధాకరమన్నారు. వాలంటీర్లు కుటుంబంలో ఉన్నవారి వివరాలు తీసుకుంటున్నారని, కుటుంబంలో ఉన్న మహిళల గురించి అడిగి తెలుసుకుంటున్నట్లు పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వాలంటీర్లు తమ కుటుంబ సభ్యులని వారు మహిళల వివరాలు ఎందుకు సేకరిస్తారన్నారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడికి సంస్కారం లేదన్న జగన్.. అందుకే వాళ్లు ప్రజలకు సేవచేసే వాలంటీర్లను అవమానిస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కోవిడ్ పేషెంట్‌లకు సేవ చేశారని సీఎం గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో మహిళా వాలంటిర్లు వారి పిల్లలను కూడా చూసుకోలేని పరిస్థితిని అనుభవించారన్నారు. అలాంటి వారిపై ఆరోపణలు చేయడానికి ఎల్లో మీడియాకు, జనసేన పార్టీ నాయకులకు మనస్సు ఎలా వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు చంద్రబాబు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ నడుచుకుటుంన్నాడని పవన్‌పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్ష నేతలు చూస్తూ ఓర్వలేకపోతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైందన్న జగన్.. రాబోయ్యే ఎన్నికల్లో వైసీపీ 175కు 175 స్థానాలు దక్కించుకుంటుదని జోస్యం చెప్పారు. దీంతో చంద్రబాబు ఇక శాస్వతంగా రాజకీయాలకు దూరం కావాల్సిందేనని ఎద్దేవా చేశారు.