Minister Roja vs Vangalapudi Anitha: వైసీపీ మంత్రి రోజాకు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, దమ్ముంటే ఏ తప్పు చేయలేదని ఏ గుడిలోనైనా రోజా ప్రమాణం చేయాలని ఛాలెంజ్ విసిరారు. అవినీతి తోటలో రోజా పువ్వులు విరబూస్తున్నాయని వంగలపూడి అనిత విమర్శించారు. మంత్రి రోజా అవినీతిని నగరి వైసీపీ నేతలే కథలు కథలుగా చెబుతున్నారన్నారు. జగనన్న బాణం తిరిగి వైసీపీకే గుచ్చుకుంటుందని అనిత ఎద్దేవా చేశారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విశాఖలో మాట్లాడుతూ… ‘రోజాను నగరి పొమ్మంటోంది.. జబర్ధస్త్ రమ్మంటోంది. చైర్ పర్సన్ పదవి కోసం రోజా తన బినామీలతో 40 లక్షలు తీసుకున్నారు. నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. దమ్ముంటే ఏ తప్పు చేయలేదని ఏ గుడిలోనైనా రోజా ప్రమాణం చేయాలి’ అని అన్నారు.ఒక దళిత మహిళ దగ్గర డబ్బులు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. బురదలో వికసించిన రోజా ఎందుకు తన అవినీతిపై స్పందించడం లేదని నిలదీశారు.
గంజి నుంచి బెంజి వరకు వెళ్ళిందని కోట్లాది రూపాయలు ఆర్ టాక్స్ ద్వారా మంత్రి రోజా సంపాదించారని అనిత అన్నారు. జే టాక్స్‌కు అనుబంధం ఆర్‌టాక్స్‌ను రోజా వసూళ్లు చేశారని, నగరిలో ఐదు మండలాలను తమ కుటుంబ సభ్యులకు అప్ప జెప్పి.. డబ్బులు వసూళ్లు చేశారని ఆరోపించారు. పర్యాటక శాఖ అంటే... తను మాత్రమే పర్యటించే శాఖ అని రోజా అంటున్నారన్నారు. కోట్లాది రూపాయల విదేశీ పర్యటనకు ఖర్చు చేస్తున్నారన్నారు.
‘రోజా రెడ్డి చెప్పులు పట్టుకోవడానికి ఉద్యోగి ఉన్నారు... ఈ సౌకర్యం జగన్‌కు.. భారతి రెడ్డికి లేదు’ అని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో సీసాలు బద్దలు కొట్టిన రోజా... ఇప్పుడు కల్తీ మద్యం ఏరులై పారుతున్నా సీసాలు ఎందుకు బద్దలు కొట్టడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు షర్మిల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లు కోవాలన్నారు. ఆనాడు షర్మిల పాదయాత్ర చేస్తేనే.. వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. గ్రావెల్, ఇసుక, భూ ఆక్రమణలలో రోజా డబ్బులు సంపాదిస్తున్నారని, టీటీడీ దర్శనాల కోసం నెలకు రూ.20 లక్షలు రోజా తీసుకుంటున్నారని, దేవుడితో పెట్టుకుంటే రోజాకు పుట్టగతులు ఉండవని అన్నారు.
ఇది కూడా చదవండి: స్పీకర్ తమ్మినేనికి గంటా శ్రీనివాస్ సవాల్!
‘నారా చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిలలను నాన్ లోకల్ అంటున్నారు. వైసీపీ నేతలకు పాదయాత్ర చేసినప్పుడు షర్మిల నాన్ లోకల్ కాదా?.. సమాధానం చెప్పాలి. షర్మిల ప్రశ్నలకు సీఎం వైఎస్ జగన్ సమాధానాలు చెప్పాల్సి ఉంది. వై-నాట్ 175 నుంచి.. సంతోషంగా దిగిపోతా అనే స్థాయికి సీఎం జగన్ దిగిపోయారు’ అని వంగలపూడి అనిత పేర్కొన్నారు. జగనన్న బాణం తిరిగి వైసీపీకే గుచ్చుకుంటోందని, ఆమె రాక వల్ల వైసీపీకి భారీగా గండి పడిందని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
సాయం చేయడమే తప్ప చేయి చాచను.. మంత్రి రోజా
రాష్ట్రంలో ఎక్కడ నుంచి నా ఇంటికి వచ్చినా.. నేను అందరికీ సహాయం చేసానే తప్ప నేను ఎవరినీ చేయి చాచలేదు. దీని మీద కూడా ఖచ్చితంగా నేను ప్రైవేటు కేసు వేస్తా.. నా ప్రతిష్టను భంగం కలిగిస్తే ఎవ్వరినీ వదిలిపెట్టను.. నా మీద ఏది పడితే అది మాట్లాడుతున్నారు. వీళ్ల చేత ఎవరు మాట్లాడిస్తున్నారో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. 2024 తర్వాత అందరి నోళ్లు మూయిస్తా.. ఎక్కడో ఎవరో మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. భగవంతుడే వారికి సమాధానం చెప్తాడు అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.