అప్పుడు ఏం చేశావ్.. పవన్ కల్యాణ్‌పై రోజా ఫైర్

రిషికొండపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. నిబంధనలు అతిక్రమించకుండా నిర్మాణాలు చేస్తుంటే ప్రతిపక్షాల బాధేంటి అని మండిపడ్డారు.

అప్పుడు ఏం చేశావ్.. పవన్ కల్యాణ్‌పై రోజా ఫైర్
New Update

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా మరోసారి ఘాటు విమర్శలు చేశారు. రిషికొండపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని.. నిబంధనలు అతిక్రమించకుండా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తుంటే ప్రతిపక్షాల బాధేంటి అని మండిపడ్డారు. సీఎం భద్రత విషయం దృష్ట్యా ఎక్కడుండాలో ఓ ఉన్నత కమిటీ నిర్ణయిస్తుందన్నారు. అది నిర్ణయించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరు అని ప్రశ్నించారు. కొండలపై భవనాలు ఎందుకు కట్టకూడదు.. గీతం వర్సిటీ భూములపై ఎందుకు మాట్లాడడం లేదు అంటూ పవన్‌ను ప్రశ్నించారు. విశాఖను దోచుకున్నది టీడీపీ నేతలేనంటూ ఆమె ఆరోపించారు.

చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్‌ కోసమే పవన్‌ పనిచేస్తున్నారంటూ విమర్శించారు. అనుమతి ఇచ్చిన విస్తీర్ణం కంటే తక్కువ ఏరియాలోనే నిర్మాణాలు జరుగుతున్నాయని.. రిషికొండపై రాద్దాంతం తగదంటూ పేర్కొన్నారు. ఎమ్మెల్యే, కనీసం వార్డు మెంబర్ కానీ పనికిమాలిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఓ పత్రిక మెయిన్ హెడ్‌లైన్‌లో వస్తుందన్నారు. అదే టూరిజం మంత్రిగా రిషికొండపై జరుగుతున్న వాస్తవాలను తెలియజేస్తే ఒక అక్షరం ముక్క రాయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టుతో పాటు ఉన్నత కమిటీ ఇచ్చిన సూచనలు, నిబంధనలు మేరకే అక్కడ నిర్మాణాలు చేపట్టామని గుర్తుచేశారు.

సుప్రీంకోర్టు, హైకోర్టు కన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గొప్పోళ్ళు ఏమి కాదు కదా అని నిలదీశారు. విపక్షాలు విషం చిమ్ముతూ వైజాగ్‌ కీర్తిని దిగజారుస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ఉత్తరాధ్రి అభివృద్ధి కోసం విశాఖలో పరిపాలన రాజధాని వస్తున్నందున రిషికొండపై అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రోజా వెల్లడించారు. మరోవైపు రోజా విమర్శలపై టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అక్రమంగా దోచుకుంటుంది వైసీపీ ప్రభుత్వమేనని.. ఆధారాలతో సహా వస్తామని సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే రోజా చర్చకు రావాలని ఛాలెంజ్ చేస్తున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రుషికొండ వద్ద పవన్‌ ఏదో డ్రామా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటరీ వ్యవస్థను దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చడాన్ని ఖండించిన ఆయన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కంటే దండుపాళ్యం బ్యాచ్‌ ఇంకేముంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పవన్‌ తన మాటలను వక్రీకరించారని, తాను విశాఖ వదిలి వెళ్లిపోతానని ఎప్పుడూ చెప్పలేదని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. తనను రాజీనామా చేయమనడానికి పవన్‌ ఎవరని ఎంపీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి తనను రాజీనామా చేయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe