Minister Roja: తిరుపతి జిల్లా నగరి రూరల్ మండలం గుండ్రాజు కుప్పం సచివాలయం పరిధిలోని రామాపురం, కుప్పిరెడ్డి కండ్రిక, జంగమాల కండ్రిక, బిసి గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా. ప్రతి గడపకు వెళ్లి నివాసితులను ఆప్యాయంగా పలకరించారు. వారికి ప్రభుత్వం చేకూర్చే సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్దిని క్షుణ్ణంగా వివరించారు. పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు మంత్రి దృష్ఠికి తెచ్చిన కొన్ని సమస్యలను ఆమె అధికారుల దృష్ఠికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు.
Also Read: టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు.. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు ఆర్ధికంగా లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఎలాంటి సిఫారసు లేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హాయాంలో కేవలం టీడీపీ కార్యకర్తలు, నాయకులు చెప్పిన వాళ్లకే పథకాలు మంజూరు అయ్యేవని ఇప్పుడు ఆ పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రూపుమాపారన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో మీకు మంచి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా, తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను ఏమి చేశామో చెప్పే దమ్ము ధైర్యం సీఎం జగన్ కల్పించారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ గెలుపు గ్యారెంటి అంటూ థీమ వ్యక్తం చేశారు.