సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చే ప్రతి సమస్య పట్ల సానుకూలంగా స్పందించే ఆయన ఈ సారి కూడా ఓ మూడేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేస్తున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి పై ట్విట్టర్ వేదికగానే కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.
కాగా,వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని రాయపర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గుగులోత్ అశోక్ కుమారుడు తలసేమియా వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ విషయాన్ని అశోక్ ట్వీట్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొని వచ్చారు. తన మూడేళ్ళ కొడుకు తలసేమియా అనే రక్తానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని తెలిపాడు. దీంతో చిన్నారికి మంచి వైద్యం అందించాలని మంత్రి కేటీఆర్ తన టీమ్ కు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
అయితే రాజకీయపరమైన సమస్యలతో పాటు చిన్నారుల ఆరోగ్య సమస్యలపై కేటీఆర్ వెంటనే స్పందించి పరిష్కార మార్గాలు చూపుతుంటారు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించడంలో కేటీఆర్ ముందుంటారు. వారం రోజుల క్రితం నగరంలో భారీ వర్షాలతో ట్రాఫిక్ జామ్ పెద్ద సమస్యగా మారింది. నానక్ రామ్ గూడా నుంచి హైటెక్ సిటీకి చేరుకోవడానికి సుమారుగా మూడు గంటలపైనే పడింది.
దీంతో నెటిజన్లు ట్రాఫిక్ లో తాము పడుతున్న ఇబ్బందులను వీడియో తీసి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని కోరారు. దీనికి వెంటనే సానుకూలంగా రియాక్ట్ అయిన కేటీఆర్.. త్వరలోనే హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో విస్తరణ ఉంటుందని బదులివ్వడంతో వాళ్లు రిలీఫ్ అయ్యారు. ఇలా తన దృష్టికి వచ్చిన సమస్యల పై వెంటనే స్పందించడంతో మంత్రి కేటీఆర్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.