బాలిక కిడ్నాప్ సుఖాంతం, 24 గంటల్లో చేధించిన రాచకొండ పోలీసులు

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలకేంద్రంలో కలకలం సృష్టించిన నాలుగేండ్ల బాలిక కిడ్నాప్‌ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది. చిన్నారిని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు గుర్తించి రాచకొండ పోలీసులకు అప్పగించారు. 24 గంటల్లోనే కిడ్నాపైన చిన్నారిని రాచకొండ పోలీసులు భద్రంగా తన ఇంటికి చేర్చారు. చిన్నారి తల్లిదండ్రులకు చిన్నారిని అప్పగించారు. దీంతో భావోద్వేగానికి గురైన ఆ కుటుంబసభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు.

బాలిక కిడ్నాప్ సుఖాంతం, 24 గంటల్లో చేధించిన రాచకొండ పోలీసులు
New Update

medchal-malkajgiri-district-accused-suresh-is-in-police-custody-rachakonda-commissioner1

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఈడబ్ల్యూఎస్‌ కాలనీలో బుధవారం రాత్రి 9 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటున్న కృష్ణవేణి 4 సంవత్సరాల పాప కనపడకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు చిన్నారి కోసం చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. అయినా బాలిక ఆచూకీ లభించలేదు. రెండు గంటల తరువాత పాపను అదే ప్రాంతానికి చెందిన సురేశ్‌ అనే వ్యక్తి ఎత్తుకొని కొండాపూర్‌ రైల్వే గేటు వద్ద నుంచి వెళ్తున్నట్లు బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేందర్‌ రెడ్డి సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. రాచకొండ సీపీ డీఎస్‌.చౌహాన్‌ వెంటనే 10 పోలీసు బృందాలను రంగంలోకి దించారు. పరిసరాల్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి పాపను అపహరించిన సురేశ్‌ కదలికలను గమనించారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో నిఘా పెట్టారు. రాత్రి ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు. ఇదిలా ఉండగా.. బాలిక అదృశ్యమైన విషయం తెలుసుకున్న సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు గురువారం ఉదయం రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రైల్వే కానిస్టేబుళ్లు ప్రవీణ్‌, నాగరాజు, వంశీ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై అనుమానాస్పదంగా చిన్నారిని ఎత్తుకొని తచ్చాడుతూ కనిపించిన సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

బాలికను ఘట్‌కేసర్‌ నుంచి తీసుకువచ్చినట్లు నిందితుడు రైల్వే పోలీసులతో చెప్పాడు. రైల్వే పోలీసులు వెంటనే ఘట్‌కేసర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘట్‌కేసర్‌ పోలీసులు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసుల వద్దకు చేరుకున్నారు. రైల్వే ఎస్పీ ఆధ్వర్యంలో బాలికతో పాటు నిందితుడిని ఘట్‌కేసర్‌ పోలీసులకు అప్పగించారు. అనంతరం చిన్నారి కృష్ణవేణిని రాచకొండ సీపీ డీఎస్‌.చౌహాన్‌, ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి కలిసి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడు సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe