Maternity Leaves Extended: సరోగసీ ద్వారా బిడ్డను పొందే తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. మాతృత్వ సెలవులు నిబంధనల్లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సరోగసి ద్వారా సంతానాన్ని పొందిన ఉద్యోగినులకు ఆరు నెలల మాతృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్(లీవ్) రూల్స్(1972)లో సవరణలు చేసిన కేంద్రం.. బిడ్డ తండ్రికి కూడా 15 రోజుల పితృత్వ సెలవులు (Paternity Leave) తీసుకునే వీలు కల్పించింది. సరోగసీతో సంతానాన్ని పొందే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు 180 రోజుల మాతృత్వ సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళకు సైతం..
అలాగే సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఆమెకూ ఈ సెలవులు వర్తిస్తాయని వెల్లడించింది. ఇద్దరు సంతానం వరకే ఈ సెలవులను పొందవచ్చని, ప్రభుత్వ ఉద్యోగి అయిన కమిషనింగ్ ఫాదర్ కూడా మొదటి ఆరునెలల్లోగా 15 రోజుల పాటు పితృత్వ సెలవులు పొందడానికి వీలుంటదని తెలిపింది. ఇక చట్టబద్ధమైన వివాహంతో 5ఏళ్లు కలిసున్న దంపతులే సరోగసీకి అర్హులు. కాగా భార్యకు 23-50ఏళ్ల లోపు వయసు, భర్తకు 26-55ఏళ్ల వయసు ఉండాలి. సాధారణ పద్ధతుల్లో సంతానం కలగని పరిస్థితుల్లో మాత్రమే ఆ దంపతులు సరోగసీ విధానంలో బిడ్డను పొందవచ్చనే విషయం తెలిసిందే.
ఈ విధానం ద్వారా బిడ్డను పొందిన ప్రభుత్వ ఉద్యోగినికి ఇంతకాలం ఈ సదుపాయం అందుబాటులో లేకపోగా.. ఇప్పటివరకు ఉన్న రూల్స్ ప్రకారం తన పూర్తి సర్వీస్‌లో పిల్లల సంరక్షణ కోసం 730 రోజులు సెలవులుగా పొందుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 18న కేంద్రం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.