kerala: కేరళలో దారుణం చోటుచేసుకుంది. తిరువనంతపురంలో ఓ 26 ఏళ్ల లేడీ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ మధ్యే తన స్నేహితుడైన మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ రువైస్‌తో పెళ్లి ఫిక్స్ అయింది. అయితే, అబ్బాయి కుటుంబం 150 సవర్ల బంగారం,15 ఎకరాల భూమి, BMW కారును కట్నంగా డిమాండ్ చేశారు. అంత కట్నం ఇచ్చుకోలేమని సహానా కుటుంబం చెప్పడంతో వారు సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన సహానా సూసైడ్ చేసుకుంది.
మృతురాలు డాక్టర్ సహానా తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో పీజీ చేస్తోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు..ఆమె బాయ్‌ఫ్రెండ్‌పై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా కట్నం అడిగినందుకు వరకట్న నిరోధక చట్టం కిందా కేసు నమోదు చేశారు. మృతురాలి బంధువుల వాంగ్మూలం తీసుకున్నారు.
Also read: ఏపీలో వాగుదాటబోయి ముగ్గురు గల్లంతు.. వీడియో వైరల్
స్ధానికుల సమాచారం ప్రకారం..డాక్టర్ సహానా తన తల్లితో కలిసి తిరువనంతపురంలో ఉంటోంది. గల్ఫ్‌లో పని చేసిన ఆమె తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయాడు. ఆ తరవాత కొద్ది రోజులకు డాక్టర్ రువైస్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతా బానే ఉందనుకున్న తరుణంలో కట్నం విషయంలో విభేదాలొచ్చాయి. ఫలితంగా ఒక్కసారిగా డిప్రెషన్‌లోకి వెళ్లింది సహానా. "అందరికీ డబ్బే కావాలి" అంటూ ఓ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. మంత్రి వీణా జార్జ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పూర్తి స్థాయిలో రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. పూర్తి నివేదికతో డిసెంబర్ 14 లోగా కమిషన్ ముందు హాజరు కావాలని సంబంధిత అధికారులకు నోటసులిచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.