Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. ఈ నెల 15 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది. గతేడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులోనే ఉంటున్నారు. తన అరెస్ట్ అనంతరం డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు మనీష్ సిసోడియా. దాదాపు 16 నెలల నుంచి మనీష్ సిసోడియా జైలుజీవితాన్ని గడుపుతున్నారు.
కేజ్రీవాల్ బెయిల్.. సీబీఐకి నోటీసులు..
లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 5న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు ఇచ్చింది కోర్టు. తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జూన్ 26న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.