మణిపూర్(manipur)లో ముగ్గురు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన ఘటన దేశాన్ని(country wide) దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత మణిపూర్‌లో మహిళలపై జరిగిన ఇతర ఘోరలపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక బాధిత మహిళల్లో ఒక యువతిపై సామూహికంగా అత్యాచారం కూడా చేశారు. ఆమె వయసు 21. అసలు ఆ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని బాధిత మహిళ మీడియాకు వివరించారు. ఆ రోజు జరిగిన అమానవీయ ఘటనను గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇంతకీ.. ఆ రోజు ఏం జరిగింది..? బాధిత మహిళ బయట పెట్టిన ఆ సంచలన విషయాలు ఏమిటి..?
బాధిత మహిళ ఏం అన్నారో ఆమె మాటల్లోనే:
'మాది కాంగ్‌పోక్పిలోని బి.ఫైనోమ్ గ్రామం. మెయితీ(meitei) వర్గానికి చెందిన అల్లరిమూకలు.. దాడి చేసేందుకు మా గ్రామంవైపు వస్తున్నట్లు సమాచారం అందింది. వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నట్లు తెలిసింది. కుకి తెగకు చెందిన వారిని హత్యలు చేయాలనే ఉద్దేశంతోనే అల్లరిమూకలు మా గ్రామంవైపు వస్తున్నట్లు మాకు తెలుసు. మేము గ్రామం నుంచి పారిపోవాలని అనుకున్నాం. అల్లరి మూకల నుంచి తప్పించుకోవాలని సమీప అటవీ ప్రాంతానికి పారిపోయాము. నాతో పాటు నా తండ్రి, సోదరుడు, మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అదే సమయంలో పోలీసులు మా వద్దకు వచ్చారు. స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు జీపు ఎక్కమన్నారు. మేము జీపు ఎక్కాం. స్టేషన్‌కు వెళ్లే దారిలో మెయితీ అల్లరిమూకలు అడ్డగించాయి. వాళ్ల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. పోలీసులు మమ్మల్ని ఆ అల్లరిమూకలు అప్పగించారు'.
'అల్లరిమూకల్లో ఉన్న కొందరు మమ్మల్ని బట్టలు విప్పమని అన్నారు. అయితే.. మెయితీ వర్గంలో కొందరు మమ్మల్ని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ.. పోలీసులు మాత్రం జీపులోనే కూర్చుని ఉన్నారు. వారు మాకు ఎలాంటి రక్షణ కల్పించలేదు. అల్లరిమూకలు మమ్మల్ని వివస్త్రలను చేసి.. ప్రైవేటు భాగాలపై చేతులు వేస్తున్నా.. పోలీసులు చోద్యం చూశారే తప్ప.. మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. మమ్మల్ని నగ్నంగా చేసి ఊరేగించారు. అడ్డువచ్చిన నా తండ్రి, సోదరుడిని కొట్టి చంపేశారు. ఆ తర్వాత పట్టపగలు బహిరంగంగా మాపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటనలో చాలా మంది పురుషులు ఉన్నారు. వారిలో కొందరిని నేను గుర్తుపట్టాను. నా సోదరుడి స్నేహితుడు కూడా ఆ గ్యాంగ్‌లో ఉన్నాడు. ఈ ఘటనపై మే 18న పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే.. నిందితులను పోలీసులు పట్టుకోలేదు. అయితే.. ఆ దుర్మార్గమైన ఘటనను వీడియో తీసినట్లు నాకు, నా కుటుంబానికి తెలియదు. ఆ వీడియో బయటు వచ్చిన తర్వాతే ఆ విషయం మాకు తెలిసింది' అంటూ బాధిత యువతి కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరో బాధిత మహిళ(42) మాటలు:
'ఆరోజు.. ఒక్కసారిగా అల్లరి మూకలు మా ఊరిపై దాడి చేశాయి. ఇళ్లను తగలపట్టారు. ఆవులు, మేకలు, పందులను ఎత్తుకెళ్లారు. ఆ రాక్షసుల నుంచి కాపాడుకునేందుకు మేం ఊరు చివర ఉన్న గుట్టల్లో దాక్కున్నాం. ఆ టైంలో కొన్ని మేకలు మా వైపు వచ్చాయి. వాటిని అనుసరిస్తూ అల్లరిమూకలు కూడా వచ్చాయి. అలా మేం ఆ రాక్షసులకు దొరికిపోయాం. మమల్ని వాళ్లు 2 గ్రూపులుగా నిర్బంధించారు. నాతోపాటు ఓ 21ఏళ్ల యువతి, ఆమె తండ్రి, సోదరుడు ఉన్నారు. మమ్మల్ని ఆ అల్లరిమూకలు రోడ్డు వైపు లాక్కెళ్లాయి. మా ఇళ్లు, సామాను పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. మీకు ఎలాంటి హానీ చేయమంటూ గుంపులోని కొందరు మాతో అన్నారు. కానీ అంతలోనే మాపై పిడిగుద్దుల వర్షం కురించారు. కర్రలతో చావ బాదారు. ఒంటిపై ఉన్న బట్టల్ని చించేశారు. అసభ్యంగా తాకారు. వాళ్ల నుంచి తప్పించుకునేందుకు ఓ పోలీస్ వ్యాన్‌లో ఎక్కి దాక్కున్నాం. ఆ జీపులో ఓ ఇద్దరు పోలీసులు, ఓ డ్రైవర్ ఉన్నాడు. కానీ ఆ అల్లరిమూకలు పోలీసువాళ్లను కూడా బెదిరించడంతో వాళ్లు పారిపోయారు'.
'ఆ తర్వాత 21ఏళ్ల యువతిని లైంగికంగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. యువతి తండ్రి, సోదరుడు వారిని నిరోధించే ప్రయత్నం చేశారు. దాంతో వాళ్లను కొట్టి చంపేసి పక్కనే ఉన్న కాలువలో పడేశారు ఆ దుర్మార్గులు. తర్వాత 21ఏళ్ల యువతితో పాటు నా బట్టలు, మరో యువతి బట్టలు తొలగించారు. మిమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించారు. ఆ తర్వాత మమ్నల్ని రోడ్డు మీద నుంచి పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లారు. 21ఏళ్ల యువతిపై కొందరు గ్యాంగ్ రేప్ చేశారు. నేను ఓ తల్లిని దయచేసి నన్ను వదిలిపెట్టండీ అని ప్రాధేయపడ్డా. వాళ్లకు నా మీద దయ కలుగుతుందని ఊహించా. కానీ అలా జరగలేదు. ఆ అమ్మాయిపై అత్యాచారం చేసిన మృగాలు.. దీన్ని ఇంకా ఎవడు రేప్ చేయాలి అనుకుంటున్నారు అని అడిగారు'.
'వాళ్లను నేను గుర్తుపట్టాను. కొందరు మా పక్కింటి వాళ్లే.. ఇంకొందరు పక్క ఊరువాళ్లు. మమ్మల్ని విడిచిపెట్టండని వాళ్ల కాళ్లావేళ్లా పడ్డా. కానీ 2గంటల పాటు వాళ్లు మాపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మమ్మల్ని మరోసారి పోలీస్ జీపు దగ్గరికి తీసుకెళ్లారు. అపుడు మా ఒంటిపై నూలుపోగు కూడా లేదు. అక్కడే ఆ 21ఏళ్ల యువతి తండ్రి, సోదరుడు జీవశ్చావాలుగా పడి ఉన్నారు. వాళ్లను చూసి ఆ యువతి గుండెలు పగిలేలా ఏడ్చింది. కొందరు యువకులు మా దగ్గరికి వచ్చి.. మీరు ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి. లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తారని అన్నారు. వేసుకోమని మాకు టీషర్టులు కూడా ఇచ్చారు. కానీ వాటిని ఆ అల్లరిమూకలు లాక్కున్నాయి. మేము వేరేవాళ్ల దుప్పట్లు కప్పుకుని ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డాం. చాలామంది మహిళలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అదే దారిలో వెళ్తున్నారు. మేం కూడా వాళ్లతో కలిసి వెళ్లాం. అలాగే నడుచుకుంటూ నడుచుకుంటూ కొద్ది రోజుల తర్వాత చూరాచంద్‌పూర్‌లోని అస్సాం రైఫిల్స్ క్యాంపుకు చేరుకున్నాం'. అంటూ బాధిత మహిళ వాపోయారు.