మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా గంజి చిరంజీవిని నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన నిన్న పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. దీంతో తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదన్న నిర్ణయానికి వచ్చిన ఆళ్ల తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామాను స్పీకర్ కు పంపించారు ఆళ్ల. పార్టీకి రాజీనామాను సీఎం జగన్ కు (CM Jagan) పంపించినట్లు సమాచారం.
ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాజధాని ప్రాంతమైన మంగళగిరికి చెందిన ఎమ్మెల్యే పార్టీని వీడడం వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. దీంతో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఏపీ రాజకీయవర్గాల్లో ఉత్కంఠగా మారింది. జగన్ నేరుగా ఆళ్లతో మాట్లాడి బుజ్జగించే అవకాశం కూడా ఉందన్న చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతోంది. గత ఎన్నికల్లో ఏకంగా అప్పటి మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ ను ఓడించి సంచలనం సృష్టించారు ఆళ్ల.