టీడీపీలోకి హీరో మంచు మనోజ్.. చంద్రబాబుతో భేటీ!

సినీ హీరో మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా? ఇప్పటికే నియోజకవర్గం కూడా ఖరారు అయిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? ఏ పార్టీ బీఫాం నుంచి పోటీ చేయనున్నారో? ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
టీడీపీలోకి హీరో మంచు మనోజ్.. చంద్రబాబుతో భేటీ!

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ?

సినీ నటుడు మంచు మనోజ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు కొంతకాలం నుంచి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా మనోజ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. భార్య మౌనికతో కలిసి చంద్రబాబుతో భేటీ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బాబుతో భేటీ అనంతరం మనోజ్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మనోజ్ భార్య మౌనిక.. దివంగత టీడీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె. మౌనిక సోదరి భూమా అఖిలప్రియ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

వైసీపీకి మద్దతుగా మోహన్‌బాబు, విష్ణు..

మరోవైపు మనోజ్ తండ్రి మోహన్ బాబు వైసీపీకి మద్దతుదారుడుగా ఉన్నారు. గత ఎన్నికల్లో మోహన్ బాబు, విష్ణు వైసీపీకి మద్దతు కూడా తెలిపారు. విష్ణు భార్య విరానికా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు. ఇటీవల మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఓ విషయంలో ఇద్దరు ఒకరిని ఒకరు కొట్టుకునే దాకా కూడా వెళ్లారు. అప్పుడు ఆ వీడియో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో మంచు మనోజ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చంద్రగిరి నుంచి పోటీ?

వాస్తవానికి మంచు మనోజ్ టీడీపీలో చేరబోతున్నారని గతేడాదే ప్రచారం జరిగింది. మనోజ్ టీడీపీలో చేరబోతున్నారని.. అంతేకాకుండా భూమా మౌనికారెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే మౌనికతో పెళ్లి జరిగింది. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కానుండడంతో మనోజ్ టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ అధికారం లోకి రావడంతో తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తారని మోహన్‌బాబు ఆశించారని.. కానీ అలా జరగలేదని కూడా చెప్పారు. మోహన్ బాబు వయసు పెరిగింది కాబట్టి మంచు మనోజ్ రాజకీయాల్లోకి రావచ్చని తెలిపారు.

అంతేకాదు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశముందని ప్రకాష్ రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చంద్రగిరిలో వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గట్టి అభ్యర్థి అయిన చెవిరెడ్డికి పోటీ ఇచ్చే అభ్యర్థి టీడీపీలో లేరు. అందుకే హీరోగా గ్లామర్ ఈమేజ్ ఉన్న మనోజ్‌ను పార్టీలోకి చేర్చుకుని అక్కడి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు కూడా తెలిపారు. మరి గోనె ప్రకాష్ రావు చెప్పింది నిజం అవుతుందా? మంచు మనోజ్ టీడీపీలో చేరి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? అనేది కాసేపట్లో తేలనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు