ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం, అవసరం తీరాక మోసం చేయడం కేసీఆర్ లక్షణమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ బస్సు యాత్రలో ఆదివారం నాడు ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, మెదక్‌లలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా కేసీఆర్ సోనియాగాంధీకి మాట ఇచ్చి తప్పిన విషయం మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసని.. కానీ సోనియాగాంధీ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో విడదీయలేని అనుబంధం ఇందిరమ్మకు సొంతం అని ఖర్గే అన్నారు. సంగారెడ్డిలో ఇందిరా గాంధీ కాలు మోపి యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారన్నారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచి దేశానికి ఆమె ప్రధానమంత్రి అయ్యారన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదల కోసం చేసిన పని దేశంలో మరెవరూ చేయలేరన్నారు. కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్‌లో ఎన్నో జాతీయ సంస్థలు నెలకొల్పిందని, వాటితో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని మల్లికార్జున ఖర్గే అన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చిందని, ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా తప్పకుండా అమలు చేసి తీరుతుందన్నారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని మాట ఇచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతి నెల వారి ఖాతాల్లో రూ.2500 వేస్తామని మల్లికార్జున్ ఖర్గే హామీ ఇచ్చారు. వరికి మద్దతు ధరతో పాటు అదనంగా మరో రూ.500 బోనస్ ఇస్తామన్నారు. విద్యార్థులకు యువ వికాసం కింద చదువులు కోసం రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Telangana: ‘అన్నా ఇటు వచ్చేయ్’.. నాగం జనార్థన్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్..!
తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు..
తెలంగాణకి సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని ఖర్గే అన్నారు. పేదలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, పావలా వడ్డీ రుణాలు, సాగు నీళ్లు... ఇలా ఏ హామీనీ సీఎం కేసీఆర్ నేరవేర్చలేదని ఖర్గే విమర్శించారు. పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతులు చనిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 5 లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల కుప్పగా మార్చారని ఆయన విమర్శించారు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఫైవ్ గ్యారంటీస్ అమలవుతున్నాయని, తెలంగాణ ప్రజలను మధ్యపెట్టేలా కేసీఆర్, కేటీఆర్, మంత్రులు అనుమానాలు రేకెత్తిస్తున్నారని, సందేహాలుంటే వచ్చి చూసుకోవచ్చని, ప్రజలను అడిగి తెలుసుకోవచ్చన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెప్పి లగ్జరీ బస్సును ఏర్పాటు చేస్తామని, స్వయంగా ఆయనే దగ్గరుండి కర్ణాటకలో అమలవుతున్న ఫైవ్ గ్యారంటీస్‌పై లబ్ధిదారులతో మాట్లాడిస్తారని ఖర్గే స్పష్టం చేశారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే..
బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్‌గా ఉన్నదంటున్నారు.. కానీ ఆ రెండూ కలిసే పనిచేస్తున్నాయన్నారు. మోడీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినట్లుగానే కేసీఆర్ కూడా గతంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనలో కార్పొరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, ఉద్యోగాల భర్తీ చేయడంలేదని ధ్వజమెత్తారు. మోడీ, అమిత్ షా, కేసీఆర్ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
డీకే సవాల్‌కు బీఆర్‌ఎస్ సిద్ధమా?: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే సోనియా మరోసారి పూనుకొని ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలను అమలు చేయడం లేదని కిరాయి మనుషులతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు. స్థానికులు పట్టుకుని నిలదీయడంతో అసలు విషయం బయటపడిందన్నారు. సీఎం కేసీఆర్ కు తాను సూటిగా సవాల్ విసురుతున్నానని.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. డీకే శివ కుమార్ సవాల్ విసిరితే కేటీఆర్ తోక ముడిచారని విమర్శించారు. కర్ణాటకకు వెళ్లడానికి బస్సు రెడీగా ఉందని, ప్రగతి భవన్ కు రావాలో, ఫామ్ హౌజ్ కు రావాలో కేసీఆర్ చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మేడిగడ్డ బ్యారేజీ గుండా పోతూ బీఆర్ఎస్ కట్టిన నాణ్యతలేని ప్రాజెక్ట్ చూద్దామన్నారు. పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తాకి కూలిందన్నట్లు మేడిగడ్డ పరిస్థితి ఉందని రేవంత్ విమర్శలు చేశారు. వీళ్లను జైలో వేసి చిప్ప కూడు తినిపించాలన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని 50వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.
కాంగ్రెస్ బస్సు యాత్ర తాత్కాలిక వాయిదా
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న విజయభేరి బస్సు యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. నేడు భువనగిరి పార్లమెంటు పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర నిర్వహించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఈ యాత్రను వాయిదా వేస్తున్నట్టు పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని తరువాత తెలియజేస్తామని వివరించారు. అయితే, అనివార్యకారణాల వల్లనే యాత్ర వాయిదా వేసినట్లు చెబుతున్నప్పటికీ.. టికెట్ రాని నాయకులు తీవ్రంగా స్పందిస్తుండడం, కొందరు పార్టీని వీడడం, రాజీనామాలు చేస్తుండడంతో ముందు వాటిని నిలువరించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా సోమవారం యాత్రలో పాల్గొనాల్సిన ముఖ్యఅతిథి రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.