కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు రిప్లై ఇచ్చారు. నిన్న విపక్ష పార్టీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాసిన లేఖకు బదులిస్తూ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. కేంద్రం చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు ఏ మాత్రమూ పొంతన లేదని కేంద్రంపై లేఖలో తీవ్ర స్థాయిలో ఖర్గే విరుచుకుపడ్డారు. మణిపూర్ అంశంపై సభలో చర్చించాల్సిందేనని పట్టుబట్టారు.
మీరు రాసిన లేఖలో ప్రస్తావించిన విషయాల్లో వాస్తవం లేదని అమిత్ షాకు ఆయన తెలిపారు. కేంద్రం చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు చాలా తేడా వుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అసహనంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. కేంద్రం తన ఇష్టాన్ని పార్లమెంట్ లో బలవంతంగా రుద్దాలని ప్రయత్నాలు చేస్తోందని ఖర్గే మండిపడ్డారు.
మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత దానిపై సంపూర్ణ చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. విపక్ష పార్టీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న లేఖ రాశారు. మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ లో నెలకొన్న గందరగోళానికి ముగింపు పలకాలని లేఖలో విపక్షాలను ఆయన కోరారు.
సభలో గందర గోళ పరిస్థితుల వున్నాయన్నారు. దీంతో పలు కీలకమైన బిల్లులపై చర్చ జరగుకుండా ఆగి పోతోందన్నారు. విపక్షాలకు రాసిన లేఖను అమిత్ షా ట్వీట్ చేశారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో చర్చించేందుకు తాము సిద్ధంగా వున్నామన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల సహకారాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. అతి ముఖ్య ఈ విషయంలో విపక్షాలు కేంద్రానికి సహకరిస్తాయని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.