ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో కాక రేపుతోన్న జూపల్లి రాక

కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక కాక రేపుతోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా హస్తం నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. జూపల్లికి వ్యతిరేకంగా కొల్లాపూర్ నేతలు వరుస ప్రెస్‌మీట్‌లు పెట్టి మరి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో కాక రేపుతోన్న జూపల్లి రాక
New Update

జూపల్లికి వ్యతిరేకంగా నేతల విమర్శలు..

బీఆర్‌ఎస్ బహిష్కృత నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చేరాలి. కానీ భారీ వర్షాల నేపథ్యంలో ఆయన చేరిక వాయిదాపడింది. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. పార్టీలో చేర్చుకునే పని అయితే కొల్లాపూర్ టిక్కెట్ ఇస్తామని హామీ ఇవ్వకుండా చేర్చుకోవాలని సూచిస్తున్నారు. జూపల్లికి ఎట్టి పరిస్థితుల్లో కొల్లాపూర్ టిక్కెట్ ఇవ్వొద్దని వరుసగా నేతలు ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారు. మొన్న కాటమోని తిరుపతమ్మ, తాజాగా చింతలపల్లి జగదీశ్వర్‌రావు విమర్శలు దాడి చేశారు. తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తమకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

టికెట్స్‌ తమకే ఇవ్వాలని డిమాండ్..

పార్టీ కోసం పనిచేసిన తమకే అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పట్టుపడుతున్నారు. సర్వేల ఆధారంగా కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తనకే టికెట్ కేటాయించాలని చింతపల్లి జగదీశ్వర్ రావు కోరుతున్నారు. జూపల్లిని పార్టీలోకి ఆహ్వానిస్తాం కానీ అతడికి టికెట్ కేటాయించడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని స్పష్టంచేశారు. ఇప్పుడు పార్టీలోకి వచ్చి టికెట్ పట్టుకెళ్తాం అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గతంలోనూ నాగర్‌ కర్నూలు సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కూడా జూపల్లి చేరికపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు పార్టీలో చేరుతున్న వారికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం టికెట్‌ను జనార్ధన్ రెడ్డి ఆశిస్తున్నారు. అయితే జూపల్లితో పాటు పార్టీలో చేరనున్న ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుళ్ల రాజేష్ కూడా ఈ నియోజకవర్గం టికెట్‌ను ఆశిస్తున్నారు. వనపర్తి సీటును యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి ఆశిస్తుండటంతో మాజీ మంత్రి చిన్నారెడ్డి డైలమాలో పడినట్లు తెలుస్తోంది. అందుకే కొత్తగా చేరే వారికి టికెట్లు ఎలా ఇస్తారంటూ సీనియర్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.

త్వరలోనే హస్తం పార్టీలో జూపల్లి చేరిక..

గులాబీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. అనంతరం జులై మొదటివారంలో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగసభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి ప్రియాకంగాంధీ సమక్షంలో జూపల్లి హస్తం పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో చేరిక ఆలస్యమైంది. త్వరలోనే మంచి ముహుర్తం చేసుకుని ఆయన పార్టీలో చేరనున్నారు. ఈలోపే జూపల్లికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు గళం విప్పుతున్నారు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి జూపల్లి చేరిక పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలకు దారితీస్తోంది. మరి ఈ విభేదాలను పార్టీ పెద్దలు ఎలా చక్కబెడతారో వేచి చూడాలి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe